Begin typing your search above and press return to search.

శివుడు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు - మంచు విష్ణు

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 12:56 PM IST
శివుడు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు - మంచు విష్ణు
X

కన్నప్ప చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. "ఈ సినిమా విష్ణు సినిమా కాదు, కన్నప్ప సినిమా. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నేను భాగమైనానా అన్న సందేహమే కలుగుతోంది. ఎన్నో బాధలు, సవాళ్లు, శ్రమ ఈ సినిమా వెనక ఉన్నాయి. అంత సులభంగా ఈ సినిమా జరగలేదు" అని ఆయన వెల్లడించారు.

తన స్నేహితుడు ప్రభాస్ గురించి మాట్లాడుతూ, “ప్రభాస్ నా జీవితంలో కృష్ణుడు లాంటివాడు. ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేకపోయినా మా నాన్నపై గల ప్రేమతో నటించారు. ఆయన మంచి మనిషి. అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే ఈ ఈవెంట్‌లో మంచు విష్ణు చెప్పిన మాటలు అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి రేపుతున్నాయి. “నేను రామజోగయ్య శాస్త్రి గురించి ఒక మాట చెప్పాలి.. ఆయన రాసిన ఈ పాట (శివ శివ శంకర) నాకు ప్రతీ రోజు ఒక ఛాలెంజ్ గానే ఉండింది. ఈరోజు కూడా సినిమా విడుదలకు ఆరు రోజులు మాత్రమే ఉండగా, శివుడు ఇంకా పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. కానీ ఆ పాటే నన్ను కాపాడింది. అది ఎంత లోతుగా ఉందంటే, మీరు అక్షరాల్ని జాగ్రత్తగా వినగలిగితే మీకే తెలుస్తుంది” అని భావోద్వేగంతో వెల్లడించారు.

ఈ పాట కన్నప్ప చిత్రానికి కేవలం సంగీత అద్భుతంగా కాక, మంచి ప్రేరణగా నిలుస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఆల్బమ్‌కి హైప్ క్రియేట్ చేసిన ఈ పాటను శివుడి సంకేతంగా భావిస్తున్నారంటే అతిగా చెప్పినట్టు కాదు. విష్ణు చెప్పిన భావోద్వేగం అందరినీ తాకుతోంది. ఈ చిత్రంలో తిన్నడు పాత్రలో విష్ణు కనిపించనుండగా, రుద్రుడిగా ప్రభాస్ భిన్నంగా కనిపించబోతున్నారు. శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారు.

ఈ చిత్రానికి భారీ విఎఫ్‌ఎక్స్‌తో కూడిన మేకింగ్ ఉండనుందని సమాచారం. శివుడి భక్తి, త్యాగం, భవోద్వేగాలతో కూడిన కథను కన్నప్ప మూవీ తెరపై చూపించబోతోంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు విష్ణు ఎమోషనల్ స్పీచ్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.