ట్రైలర్ టాక్: కేరళ సుందరితో దిల్లీ బోయ్ ప్రేమ పాట్లు
ఇప్పుడు ఇంచుమించు అదే జానర్ లో క్రాస్ కల్చర్ లవ్ స్టోరీతో ఓ సినిమా తెరకెక్కింది. సిద్ధార్థ్ - జాన్వీ కపూర్ జంటగా నటించారు.
By: Sivaji Kontham | 12 Aug 2025 7:57 PM ISTఒక ప్రాంతం భాష యాస కల్చర్ కట్టు బొట్టు.. ఇంకో ప్రాంతంలోని భాష యాస కల్చర్ కట్టుబాట్లు ఇతర వ్యవహారాలతో సింక్ అవ్వడం అంత సులువేమీ కాదు. ముఖ్యంగా ఉత్తరాది కల్చర్ కి, దక్షిణాది కల్చర్ కి మధ్య ఉండే వైవిధ్యం చాలా ఎక్కువ. ఇక్కడ మాస్ రాణీకి అక్కడ క్లాస్ అబ్బాయికి ప్రేమ కుదిరితే ఆ తర్వాత ఇరువైపులా తల్లిదండ్రులు, బంధువులు కూడా చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. పిల్లల ప్రేమపెళ్లిళ్ల వ్యవహారంలో ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. క్రాస్ కల్చర్ వివాహాలు చాలా సమస్యల్ని కొని తెస్తుంటాయి. అదే సమయంలో ఒకరి కల్చర్ నుంచి మరొకరు చాలా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఈ తరహా కథాంశాలతో సినిమాలు కూడా కొన్ని ఇంతకుముందు తెరకెక్కి మంచి ఆదరణ పొందాయి. షారూఖ్ ఖాన్- దీపిక పదుకొనే జంటగా రోహిత్ శెట్టి తెరకెక్కిన `చెన్నై ఎక్స్ ప్రెస్` ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ జానర్ లో అత్యంత భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని సాంప్రదాయ మాఫియా కుటుంబానికి చెందిన అమ్మాయి(దీపిక)తో షారూఖ్ స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. హిందీ ప్రేక్షకులే కాదు, దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బాగా ఆదరించారు.
ఇప్పుడు ఇంచుమించు అదే జానర్ లో క్రాస్ కల్చర్ లవ్ స్టోరీతో ఓ సినిమా తెరకెక్కింది. సిద్ధార్థ్ - జాన్వీ కపూర్ జంటగా నటించారు. ఇందులో జాన్వీ కపూర్ కేరళకు చెందిన సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతి కాగా, దిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించాడు. ఈ చిత్రం దక్షిణాది - ఉత్తరాది ప్రేమకథను తెరపై ఆవిష్కరించనుంది. పరాన్ (సిద్ధార్థ్ మహోత్రా) తన స్నేహితుడితో కలిసి కేరళకు వచ్చి అక్కడ సుందరిని (జాన్వి కపూర్) కలిసాక ఏం జరిగిందనేది ట్రైలర్ లో చూపించారు. ఇద్దరూ ప్రేమలో పడిన తర్వాత అన్ని ప్రేమకథల మాదిరిగానే వారు కూడా చాలా అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది.
ట్రైలర్ ఆద్యంతం జాన్వీకపూర్ సాంప్రదాయ మలయాళీ అమ్మాయిగా తనదైన అందం అభినయంతో ఆకర్షించింది. ఉత్తరాది అబ్బాయిగా సిద్ధార్థ్ స్మార్ట్ గా కనిపించాడు. అతడి ఛామింగ్ లుక్స్ జాన్వీతో రొమాన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకుముందు విడుదలైన పరమ్ సుందరి పాట ఆకట్టుకుంది. జాన్వీ చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తోంది. లాల్ కలర్ అనే పాట ఓకే అనిపించింది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ జస్ట్ యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కేరళ సుందరి అయిన జాన్వీ రజనీకాంత్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ల రిఫరెన్సులతో డైలాగులు చెబుతుండడం అన్ని ప్రాంతాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పాన్ ఇండియా అప్పీల్ కోసం ఈ డైలాగుల్ని కూడా దర్శకుడు తెలివిగా జోడించాడని భావించవచ్చు. కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత జాన్వీ, సిధ్ ఇద్దరికీ ఇది కీలకమైన సినిమా. మడోక్ ఫిలింస్ గోల్డెన్ హ్యాండ్ వర్కవుటైతే, ఇది ఆ ఇద్దరికీ మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.