దిల్ రాజు లైనప్.. నెక్స్ట్ రాబోయే సినిమాలివే!
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్‌గా అద్భుతమైన మార్క్ సాధించిన వ్యక్తి దిల్ రాజు.
By: Tupaki Desk | 24 Jun 2025 9:00 PM ISTతెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్‌గా అద్భుతమైన మార్క్ సాధించిన వ్యక్తి దిల్ రాజు. ‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై వరుస విజయాలు అందించిన ఆయనకి ఇటీవల 'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్ ఓ బిగ్ షాక్ ఇచ్చింది. అయితే అదే సమయంలో వెంకటేశ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి విజయం అందుకోవడంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండస్ట్రీలోకి మరింత బిజీ అయ్యారు.
ప్రస్తుతం దిల్ రాజు, నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఇదే ఏడాదిలో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా విడుదల చేయబోతున్న చివరి సినిమా ఇదే కావడం గమనార్హం. గద్దర్ అవార్డుల వేడుకను కూడా ఆయన ఇటీవల ఘనంగా నిర్వహించారు. సినిమాలతో పాటు తెలుగు సినిమా అభివృద్ధికి కూడా కృషి చేస్తున్న దిల్ రాజు, రాబోయే కాలంలో తన లైనప్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆగస్ట్ 2024 నుండి మూడు ప్రాజెక్టులు సెట్స్ మీదకి వెళ్లనున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్ధన్’, నితిన్ నటిస్తున్న ‘ఎల్లమ్మ’, అలాగే అశీష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘దేతడి’ అనే సినిమాల షూటింగ్స్ మొదలవనున్నాయి. ఈ చిత్రాలన్నీ 2026లో రిలీజ్ కానున్నాయని దిల్ రాజు తెలిపారు. షెడ్యూల్స్ పూర్తైన తరువాత రిలీజ్ డేట్లు ప్రకటిస్తామన్నారు.
దిల్ రాజు చెప్పిన మరో కీలకమైన విషయం ఏమిటంటే.. పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్ సినిమాలు 2027లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కథలు, క్రాఫ్ట్ వర్క్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులు రాబోయే సంవత్సరంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లాంచ్ కానున్నాయని చెప్పారు. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలతో కూడా కలసి ఈ ప్రాజెక్టులను రూపొందించాలన్నది ఆయన ఆలోచన.
ఇదే సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ తాను అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలన్న ఉద్దేశం ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టులపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇలా చూస్తుంటే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోయే రెండేళ్లలో పెద్ద ప్రాజెక్టుల పంట పండబోతోందని చెప్పొచ్చు.