దిల్ రాజు.. డబ్బు మాత్రమే నష్టపోవట్లే..
ఇండస్ట్రీలో ఏడాది పొడవునా వివిధ సినిమాలతో బిజీగా ఉన్న అతికొద్ది మంది నిర్మాతలలో దిల్ రాజు ఒకరు.
By: Tupaki Desk | 8 July 2025 9:09 AM ISTఇండస్ట్రీలో ఏడాది పొడవునా వివిధ సినిమాలతో బిజీగా ఉన్న అతికొద్ది మంది నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఒక సినిమాతో లాభ నష్టాలు చూడకుండా టోటల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకునే రాజు గారు పర్ఫెక్ట్ బిజినెస్ మెన్ గానే కొనసాగుతూ వస్తున్నారు. నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా పెద్ద సినిమాలతో మంచి ప్రాఫిట్స్ అందుకుంటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం వారి బ్రాండ్ కు తగ్గ సినిమాలు రావడం లేదు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఈ సీనియర్ నిర్మాతకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇటీవల దిల్ రాజు నిర్మించిన సినిమాలైతే సరే, ఆయన పంపిణీ చేసిన చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర వరుసగా పరాజయాలు చవిచూస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉండేది. 'దిల్ రాజు బ్యానర్‌లో వస్తే.. కచ్చితంగా మంచి సినిమా అయ్యి ఉంటుంది' అనే భావనతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లేవాళ్లు.
అదే సమయంలో హీరోల ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేసే స్థాయికి వెళ్లారు. ఆ స్థాయిలో ఆయనకు ఒక బ్రాండ్ వెల్యూ ఉండేది. అయితే గత మూడు సంవత్సరాలుగా ఆ బ్రాండ్ క్రమంగా పడిపోతోంది. ఇటీవల దిల్ రాజు సినిమాలకు సంబంధించి ఎక్కువగా నెగటివ్ టాక్ రావడం, బిజినెస్ పరంగా భారీ నష్టాలే మిగలడం కనిపిస్తుంది.
ముఖ్యంగా 'తమ్ముడు' చిత్రం బాక్సాఫీస్ దగ్గర చాలా పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. భారీ అంచనాలతో విడుదల చేసినా, కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫెయిల్యూర్‌తో బయ్యర్లు భారీ నష్టాలు చవిచూశారు. దాంతో ఆయనపై మార్కెట్‌లో నమ్మకం తగ్గుతోంది. ఇక బడ్జెట్ విషయానికొస్తే.. గతంలో వరకు ప్లాన్డ్ బడ్జెట్‌లో సినిమాలు చేస్తూ లాభాలు పొందిన దిల్ రాజు, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉన్నా కంటెంట్ మాత్రం అంతగా హైలెట్ కావడం లేదు.
దిల్ రాజు సినిమా అంటేనే ఒక బ్రాండ్ వాల్యూ.. అలాంటిది సినిమాలు ఖర్చు ఎక్కువ కంటెంట్ తక్కువ అనే తరహాలో ఉండడంతో SVC బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది. ఆర్య, బొమ్మరిల్లు, శతమానం భవతి లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఈమధ్య పడలేదు. ఎక్కువగా స్టార్స్ కాంబినేషన్స్ అంటూ వందల కోట్ల బడ్జెట్ కు వెళ్లారు. అదే ఆయనకు మైనెస్ అవుతోంది.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘రౌడీ జనార్దన్’, ‘ఎల్లమ్మ’ అనే రెండు సినిమాలు రూపొందుతున్నాయి. వీటిని ఏవిధంగా ప్లాన్ చేసి, మార్కెట్లో తిరిగి బ్రాండ్ నమ్మకాన్ని ఎలా తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలు అయినా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. మళ్లీ సెట్ అవ్వడానికి అవకాశముంది. లేదంటే.. ఈ బ్రాండ్ వాల్యు మరింత తగ్గే ప్రమాదం ఉంది. మరి రాజుగారి నెక్స్ట్ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.