Begin typing your search above and press return to search.

కూలీ.. ఈ హైప్ ఎవరి క్రెడిట్?

తెలుగేతర భాషల్లో కూడా ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఊగిపోవడానికి లోకేష్ పేరే ప్రధాన కారణం. ఇప్పుడు రజినీ సినిమాకు కూడా హైప్ తీసుకురావడంలో లోకేష్ కీలకం అయ్యాడు.

By:  Garuda Media   |   13 Aug 2025 3:38 PM IST
కూలీ.. ఈ హైప్ ఎవరి క్రెడిట్?
X

ఈ మధ్య కాలంలో కూలీ అంత క్రేజ్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను కాస్త తక్కువ అంచనా వేసిన వాళ్లంతా.. వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూసి అవాక్కవుతున్నారు. హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్-2’ సినిమా వారి వారి జోన్లలో వార్-2 మీద స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తుందని అంతా అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ‘వార్-2’కు దీటుగా నిలవడమే కాదు.. కొంత డామినేషన్ కూడా చూపిస్తోంది ‘కూలీ’. హిందీలో కూడా ‘వార్-2’కు గట్టి పోటీనిస్తోంది.

రిలీజ్ చేస్తున్న పరిమిత థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతుండడంతో.. ముందు అనుకున్న దాని కంటే ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో క్రేజ్ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐతే ఈ హైప్ క్రెడిట్ అంతా ఎవరిది అనే చర్చ జరుగుతోందిప్పుడు.

గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ, రోబో, కబాలి లాంటి చిత్రాలకు ఇలాంటి హైప్ చూశాం. ఐతే అప్పుడు అందులో మేజర్ క్రెడిట్ రజినీకే చెందుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత కొన్నేళ్లలో రజినీ స్టార్ పవర్ తగ్గింది. కొన్ని సినిమాలకు అస్సలు హైపే లేదు. పేట, దర్బార్, పెద్దన్న, వేట్టయాన్ లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ‘కూలీ’ పట్ల ఇంత ఆసక్తి ఏర్పడడంలో లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ క్రెడిట్ చాలా ఉంది. అతడి గత చిత్రం ‘లియో’ కూడా ఇలాగే బంపర్ హైప్ తెచ్చుకుంది.

తెలుగేతర భాషల్లో కూడా ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఊగిపోవడానికి లోకేష్ పేరే ప్రధాన కారణం. ఇప్పుడు రజినీ సినిమాకు కూడా హైప్ తీసుకురావడంలో లోకేష్ కీలకం అయ్యాడు. అదే సమయంలో అనిరుధ్ మ్యూజిక్.. అక్కినేని నాగార్జున విలన్ పాత్ర చేయడం కూడా సినిమా పట్ల జనాలు ఊగిపోవడానికి కారణాలయ్యాయి. ఇంకా ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే సినిమాకు హైప్ పెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు. మొత్తానికి అన్ని కారణాలూ కలిసొచ్చి ‘కూలీ’ బంపర్ క్రేజ్‌తో రిలీజవుతోంది తప్ప.. ఇంతకుముందులా రజినీకే మేజర్ క్రెడిట్ కట్టబెట్టే పరిస్థితి లేదు.