300 కోట్ల స్కాం... సినీ కార్మికుల మహాధర్నా
By: Ramesh Palla | 13 Aug 2025 1:48 PM ISTచిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ అవినీతి చోటు చేసుకుందని, సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ భారీ అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా రూ.300 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు . హౌసింగ్ సొసైటీలో జరిగిన భారీ కుంభకోణంపై సినీ కార్మికులు, నాయకులు ఎఫ్‌డీసీ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉంటున్న సినీ కార్మికులకు ఇళ్లు దక్కడం లేదని, నిజమైన కార్మికులకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నాయకులు ఆరోపించారు. వెంటనే వల్లభనేని అనిల్ కుమార్ ను అరెస్ట్ చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయమై పోరాటం మరింత ఉధృతం చేయబోతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
చిత్రపురి లో భూ ఆక్రమణలు
చిత్రపురి పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమించారు. చిత్రపురిలో ప్రస్తుతం ఉన్న 2.5 ఎకరాల భూమిలో కార్మికుల కోసం ఇళ్లను నిర్మించకుండా భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టారు అంటూ ఆరోపించారు. 1200 నుంచి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల వాటిని బయట వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధం అవుతున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు హెచ్‌ఎండీఏ, సీఎంఓ కార్యాలయ అధికారులతో కుమ్మక్కు అయినట్లు అనిపిస్తుందని ఆందోళనకారులు అంటున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అనిల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు
వల్లభనేని అనిల్ కుమార్‌పై 15 FIRలు, 10 ఛార్జ్‌షీట్‌లు నమోదయ్యాయి. రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన అక్రమాలు ఆపడం లేదని నిరసనకారులు తెలిపారు. న్యాయస్థానం రిట్ పిటిషన్ నెం. 18225/2021, 7642/2024, 9335/2025 ద్వారా ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదని, దీని వల్లే అనిల్ కుమార్ అవినీతికి అడ్డు లేకుండా పోయిందని అంటున్నారు. గత ప్రభుత్వం అవినీతిపరులను కాపాడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు వారిని రక్షించే ప్రయత్నం చేస్తుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు అయినా వెంటనే ఈ విషయమై జోక్యం చేసుకుని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నాయకుల డిమాండ్లు
20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురు చూస్తున్న 6,000 మంది సభ్యులకు వెంటనే ఇళ్లు మంజూరు చేయాలి, కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత కమిటీని రద్దు చేసి, వెంటనే అడ్-హాక్ కమిటీని నియమించాలి. కొత్తగా కట్టబోయే ట్విన్ టవర్స్‌లో కేవలం సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించి, అర్హులైన సినీ కార్మికులకే కేటాయించాలి. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ధర్నా కార్యక్రమంలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.