Begin typing your search above and press return to search.

'మా' మంచి సినిమాకు పెద్ద నష్టం..!

ఒకప్పుడు సినిమాలు ఓపెనింగ్స్‌తో పోల్చితే లాంగ్‌ రన్‌లో ఎక్కువ వసూళ్లు సాధించేది. కానీ ఇప్పుడు సినిమాలు ఓపెనింగ్‌ సాలిడ్‌గా లేకుంటే లాంగ్ రన్‌లో వసూళ్లు ఉండటం లేదు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 2:00 PM IST
మా మంచి సినిమాకు పెద్ద నష్టం..!
X

ఒకప్పుడు సినిమాలు ఓపెనింగ్స్‌తో పోల్చితే లాంగ్‌ రన్‌లో ఎక్కువ వసూళ్లు సాధించేది. కానీ ఇప్పుడు సినిమాలు ఓపెనింగ్‌ సాలిడ్‌గా లేకుంటే లాంగ్ రన్‌లో వసూళ్లు ఉండటం లేదు. సాధ్యం అయినంత వరకు మొదటి మూడు రోజుల్లో రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్‌ వస్తే మొదటి వారం పూర్తి అయ్యేప్పటి వరకు వసూళ్లు మొత్తం రాబట్టుకోవాల్సి ఉంటుంది. రెండో వారంలో సినిమాలు థియేటర్‌లలో ఉండటం అనేది చాలా కష్టంగా మారింది. గొప్ప సినిమాలు, అద్భుతంగా ఉన్న సినిమాలు మాత్రమే రెండు మూడు వారాలు ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో అత్యధిక స్క్రీన్స్‌లో సినిమాలు విడుదల చేస్తే ఫలితంతో సంబంధం లేకుండా డీసెంట్‌ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్‌లో విడుదలైన 'మా' అనే సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేకర్స్ ముందు చూపు లేకుండా వ్యవహరించడంతో చాలా తక్కువ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. సినిమా కంటెంట్‌కు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ నేపథ్యంలో మొదటి మూడు రోజుల్లో రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కానీ మల్టీప్లెక్స్‌ల్లో ఎక్కువ షోలు పడక పోవడంతో పాటు, ఎక్కువ స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేయడంలో విఫలం కావడంతో సినిమా మొదటి మూడు రోజుల్లో దాదాపు రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. మా సినిమా రిలీజ్‌ ప్లాన్‌ సరిగా లేని కారణంగా నష్టం జరిగిందని పలువురు అంటున్నారు.

సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మా' సినిమాకు విశాల్‌ ఫురియా దర్శకత్వం వహించాడు. షైతాన్‌ సినిమా యూనివర్స్‌లో భాగంగానే ఈ సినిమాను చేస్తున్నట్లు మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న షైతాన్‌కి ఏమాత్రం తగ్గకుండా మా సినిమాలోనూ హర్రర్‌ ఎలిమెంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఒక తల్లి తన బిడ్డను క్షుద్ర శక్తుల నుంచి ఎలా కాపాడుకుంది అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు. తల్లిగా కాజోల్‌ నటన ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాలో రోనిత్‌ రాయ్‌, ఇంద్రనీల్‌ సేన్ గుప్తా, జితిన్‌ గులాటి, గోపాల్‌ సింగ్‌, సూర్య శిఖా దాస్ తదితరులు నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన 'మా' సినిమాకు వచ్చిన రివ్యూలతో మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎక్కువ స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేయలేక పోయారు. అజయ్‌ దేవగన్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినప్పటికీ రిలీజ్ విషయంలో మాత్రం నిరుత్సాహం తప్పలేదు. సాధారణంగా బాలీవుడ్‌ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలను కూడా దాదాపుగా రెండు వేల స్క్రీన్స్‌కు తగ్గకుండా రిలీజ్‌ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. దాదాపుగా సగం స్క్రీన్స్‌లో మాత్రమే సినిమా విడుదల అయిందని, ఎక్కువ స్క్రీన్స్‌ లో రిలీజ్‌ చేయక పోవడంకు కారణం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మంచి సినిమాకి సరైన రిలీజ్ ప్లాన్‌ చేయక పోవడంతో నష్టం మిగిలిందని బాక్సాఫీస్ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.