క్రేజీ సీక్వెళ్లపైనే స్టార్ హీరోయిన్ల ఆశలు
గత కొంతకాలంగా క్వీన్ కంగన రనౌత్ వరస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. కెరీర్‌లో సరైన బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ కోసం వేచి చూస్తోంది.
By: Tupaki Desk | 30 April 2025 1:00 AM ISTగత కొంతకాలంగా క్వీన్ కంగన రనౌత్ వరస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. కెరీర్‌లో సరైన బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ కోసం వేచి చూస్తోంది. తను వెడ్స్ మను, క్వీన్ సినిమాలతో తాను సాధించిన మంచి పేరు, డబ్బు ఇప్పుడు మళ్లీ రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే కంగనను నమ్ముకున్న చాలా మంది నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి ట్రాక్ లోకి తేవాలంటే ఇప్పుడు క్వీన్ సరైన ప్రయత్నంతో ముందుకు రావాల్సి ఉంది. కానీ అలాంటి ప్రయత్నం జరుగుతోందా? అంటే దానికి సంబంధించిన సమాచారం లేదు.
ఇలాంటి సమయంలో వికాస్ బహల్ క్వీన్ ఫ్రాంఛైజీలో కొత్త స్క్రిప్టుపై పని చేస్తున్నారన్న టాక్ వినిపించింది. కంగన తిరిగి క్వీన్ గా తెరపై కనిపిస్తే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడున్న క్రైసిస్ నుంచి కంగన బయటపడేందుకు ఆస్కారం ఉందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో సుజోయ్ ఘోష్ కూడా మరో సీనియర్ నటి విద్యాబాలన్ కోసం కహానీ ఫ్రాంఛైజీలో కొత్త స్క్రిప్టును అన్వేషిస్తున్నారని ప్రచారం ఉంది. బాలన్ `కహానీ 2` ఓటీటీలో చక్కని ఆదరణ దక్కించుకుంది. అందుకే ఈ ఫ్రాంఛైజీలో ఏదైనా కొత్త కథ వస్తే ప్రజల్లో ఆసక్తిని పెంచేందుకు అవకాశం ఉంది. ఈ ఇద్దరితో పాటు రాణి ముఖర్జీ సైతం మర్ధానీ ఫ్రాంఛైజీలో కొత్త కథతో అభిమానులను అలరించనున్నాయని కథనాలొస్తున్నాయి. మర్ధానీ 3 చిత్రీకరణ కోసం ఆదిత్య చోప్రా సర్వసన్నాహకాల్లో ఉన్నారు.
ఇటీవలే విడుదలైన సీక్వెల్ సినిమా కేసరి 2 (అక్షయ్) పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం బాలీవుడ్ వర్గాల్లో కొంత హుషారు నింపింది. రైడ్ సీక్వెల్, హౌస్ ఫుల్ 5 వంటి ప్రాంఛైజీ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించనున్నాయి. అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ సీక్వెల్ `సితారే జమీన్ పర్` ని విడుదలకు తెస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.