భక్త కన్నప్ప కోసం 70 రోజుల పాటూ అడవిలోనే!
కృష్ణం రాజు టైటిల్ రోల్ పోషిస్తూ బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమా భక్త కన్నప్ప. టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రిలీజై సుమారు 50 ఏళ్లవుతుంది.
By: Tupaki Desk | 24 Jun 2025 1:10 PM ISTకృష్ణం రాజు టైటిల్ రోల్ పోషిస్తూ బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమా భక్త కన్నప్ప. టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రిలీజై సుమారు 50 ఏళ్లవుతుంది. ఇప్పుడు మంచు విష్ణు అదే కథతో కన్నప్ప పేరుతో సినిమా తీసి దాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్తున్నాడు. జూన్ 27న కన్నప్ప రిలీజ్ కానున్న నేపథ్యంలో అందరూ భక్త కన్నప్ప సినిమా గొప్పదనం గురించి ఆరా తీస్తున్నారు.
70వ దశకంలో యూత్ కు మైథాలజీ, భక్తి చిత్రాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం చూసి మిగిలిన సినిమాలకు యూత్ ఎలా వస్తున్నారో, ఈ జానర్ సినిమాలకు కూడా అలానే యూత్ ను థియేటర్లకు రప్పించాలనుకున్నారు కృష్ణంరాజు. బెన్‌హార్, టెన్ కమాండ్‌మెంట్స్ సినిమాలను ఆదర్శంగా తీసుకుని, తీస్తే అప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యి, అప్పుడే కన్నడలో రాజ్‌కుమార్ చేసిన బెడర కన్నప్ప ను స్పూర్తిగా తీసుకుని కన్నప్ప కథను సినిమాగా చేయాలనుకున్నారు.
అందులో భాగంగానే కృష్ణవేణి సినిమా డైరెక్టర్ మధుసూదన రావు దర్శకత్వంలో కన్నప్పను చేయాలనుకున్నారు. దాని కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైంది. కొన్ని సాంగ్స్ ను కూడా రికార్డు చేశారు, ఆ తర్వాత అనుకోకుండా మదుసూదన రావు కన్నప్ప నుంచి తప్పుకోవడంతో అదే టైమ్ లో ముత్యాల ముగ్గుతో మంచి హిట్ ను అందుకున్న బాపు ని సంప్రదించారు కృష్ణం రాజు.
ఆల్రెడీ రెడీ చేసిన స్క్రిప్ట్ ను బాపుకి ఇవ్వగా ఆయన కథలో కొన్ని మార్పులు అవసరమని సూచించి దాన్ని ముళ్లపూడి వెంకట రమణకు ఇచ్చారు. దీంతో ఆయన ఆ కథను మరింత ఇంట్రెస్టింగ్ గా, ఎమోషనల్ గా మలిచారు. తన సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ లో తీస్తోన్న మొదటి పౌరాణిక సినిమా కావడంతో కన్నప్పను భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణం రాజు భావించారు.
అందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయాలని భావించి రెండు నెలల పాటూ కష్టపడి దాని కోసం ఏర్పాట్లు చేయించారు. అక్కడే షూటింగ్ చేయాలని మద్రాసు నుంచి పని వాళ్లను అక్కడకు రప్పించారు. అప్పట్లో ఏం కావాలన్నా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఏ ఒక్క వస్తువు దొరక్కపోయినా ఆ రోజు షూటింగ్ ఆగిపోవడంతో ఆర్టిస్టులు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. అందుకే బుట్టాయగూడెంలో టెంపరరీ స్టూడియోను ఏర్పాటు చేసి అక్కడే టైలర్, కార్పెంటర్, సెట్ డిజైనర్స్ తో పాటూ వారికి కావాల్సిన వస్తువులను కూడా ముందే తీసుకొచ్చి రెడీగా ఉంచేవారట.
ఆర్టిస్టులంతా బుట్టాయగూడెంలోనే ఉంటూ రోజు అడవిలో షూటింగ్ దగ్గరకు వెళ్లి వస్తుండేవారు. షూటింగ్ జరిగే చోటుకీ, ఆర్టిస్టులు ఉండే చోటుకీ 15 మైళ్లు ఉండేదట. రోజూ జీపుల్లో అక్కడికి వెళ్లి షూటింగ్ చేసుకుని వచ్చేవారట. దారి సరిగా ఉండకపోవడంతో రోజూ ఎక్కడో చోట ఆ జీపులు ఇరుక్కునిపోయేవట. 500 మందికి పైగా బృందం 70 రోజుల పాటూ అక్కడే ఉండి షూటింగ్ ను పూర్తి చేశారట. వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి, ఆదివారం అందరికీ సెలవు ఇచ్చి ఆ రోజు విందు, వినోదాలతో ఆనందంగా గడిపేవారట.
రౌద్రంగా ఉండే కృష్ణం రాజు నుంచి భక్త కన్నప్ప లాంటి సినిమా రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో సినిమాకు భారీ బడ్జెట్ అంటే రూ. 14 నుంచి రూ.16 లక్షలు. కానీ కృష్ణం రాజు భక్త కన్నప్ప కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారేమో అని ఫ్రెండ్స్ హెచ్చరించినా కృష్ణం రాజు మాత్రం వెనుకడుగు వేయలేదని చెప్తుంటారు. ఎన్నో కష్టాలతో, ఇబ్బందులతో 1976లో రిలీజైన భక్త కన్నప్ప సూపర్ హిట్ గా నిలిచి నటుడిగా, నిర్మాతగా కృష్ణం రాజు కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు మంచు విష్ణు కూడా కన్నప్ప సినిమాతో అలాంటి గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయ పడుతున్నాడు. మరి కన్నప్ప విష్ణుకు ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి.