టైగర్ వర్సెస్ రణబీర్: ఫ్యాన్ వార్ పీక్స్
యానిమల్ లో ప్రదర్శించిన హింసను మించి పది రెట్లు టైగర్ ష్రాఫ్ సినిమాలో హింస కనిపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎటు చూసినా రక్తం ఏరులై పారినట్టు చూపించారు.
By: Sivaji Kontham | 14 Aug 2025 3:00 AM ISTతెలుగు నుంచి తేజ సజ్జా `మిరాయ్`, హిందీ నుంచి వివేక్ అగ్నిహోత్రి `ది బెంగాల్ ఫైల్స్` చిత్రాలు విడుదలవుతుండగా, అదే సీజన్ లో టైగర్ ష్రాఫ్ నటించిన `భాఘి 4` విడుదలకు సిద్ధమవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కేటగిరీలో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ సినిమాలో హద్దుమీరిన రక్తపాతం, హింసను ప్రజల తట్టుకోలేకపోయారు. యానిమల్ లో ప్రదర్శించిన హింసను మించి పది రెట్లు టైగర్ ష్రాఫ్ సినిమాలో హింస కనిపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎటు చూసినా రక్తం ఏరులై పారినట్టు చూపించారు.
క్రూరత్వం, రక్తపాతం, హింస ఎంతగా పెరిగితే అంత పెద్ద హిట్టు కొడతామనే భ్రమ ఇటీవల మేకర్స్ లో కనిపిస్తోంది. కన్నడ దర్శకుడు నమ్మ హర్ష కూడా ఇందుకు అతీతుడు కాదు. అతడు భాఘి 4 చిత్రాన్ని విపరీతమైన హింస, రక్తపాతం నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. టీజర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అతడు సినిమా మొత్తం ఇలాంటి హింసాత్మక సన్నివేశాలతో చూపిస్తే, దానిని ఫ్యామిలీ ఆడియెన్ చూడటం చాలా కష్టం. అందుకే సెన్సార్ క్లీన్ గా ఏ సర్టిఫికెట్ ని జారీ చేసింది. అయితే కేవలం ఏ సర్టిఫికెట్ జారీ చేయడం మాత్రమే కాదు, ఈ సినిమా నుంచి అదుపు తప్పిన హింసను తగ్గించకపోతే అది థియేటర్లలో రోతగా ఉంటుందని కూడా విశ్లేషిస్తున్నారు.
సోషల్ మీడియాల్లో ప్రస్తుతం భాఘి 4 వర్సెస్ యానిమల్ ఫ్యాన్ వార్ ముదిరి పాకాన పడింది. భాఘి 4లో ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని `యానమిల్` నుంచి కాపీ కొట్టారని, తీవ్రమైన రక్తపాతం హింసకు సంబంధించిన సన్నివేశాలను ఆ సినిమా నుంచి కాపీ చేసారని రణబీర్ అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే యానిమల్ చిత్రంలో చాలా సన్నివేశాల్ని ఇతర సినిమాల నుంచి కాపీ కొట్టారని టైగర్ ష్రాఫ్ అభిమానులు ప్రతిదాడి చేస్తున్నారు. అయితే ఇరు వర్గాల ఫ్యాన్స్ తమ సినిమాలను సమర్థించుకుంటున్నారు. అయితే యానిమల్ చిత్రంలో బలమైన సన్నివేశాలకు అనుగుణంగా మాత్రమే యాక్షన్ ఎపిసోడ్లను పండించడంలో సందీప్ వంగా మాస్టర్ క్రాఫ్ట్ ను అందరూ ప్రశంసించారు. `మార్కో` అనే కన్నడ చిత్రంలోను కథానాయకుడి హింస శ్రుతిమించింది. కానీ లాజిక్ కి అందని ట్విస్టులతో సినిమా రక్తి కట్టించింది.