టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శిష్యుడితో బచ్చన్ వారసుడు
బాలీవుడ్ లెజండరీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో అభిషేక్ బచ్చన్ కెరీర్ ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 24 Jun 2025 11:45 AM ISTబాలీవుడ్ లెజండరీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో అభిషేక్ బచ్చన్ కెరీర్ ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి మెగా బ్రాండ్ ఎఫెక్ట్ కారణంగా కూడా అతను అనుకున్నంత రేంజ్ కు చేరలేకపోయాడు. అయినప్పటికీ అప్పుడప్పుడూ నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో ‘కింగ్’ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఆయన మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. దాన్ని టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సహాయ దర్శకుడు తెరకెక్కించనున్నాడన్న వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అభిషేక్ బచ్చన్ నటించబోయే ఈ కొత్త సినిమా దర్శకుడు శన్ముఖ గౌతమ్. ఈయన గతంలో ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు తొలిసారిగా పూర్తి స్థాయి దర్శకుడిగా వెండితెరపైకి రాబోతున్నాడు. ఇది యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుండే సినిమా. ఇందులో అభిషేక్ బచ్చన్ మాంసం కొట్టే కసాయి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.
తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని నిర్మించబోయే బాధ్యతను టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేపట్టనుంది. ఇటీవలే హిందీలో ‘జాట్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు అభిషేక్ బచ్చన్ సినిమా నిర్మాణం ద్వారా మరింత పాగా వేయాలని చూస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే తెలుగులో భారీ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవంతో, హిందీలో కూడా అదే స్థాయిలో ప్రెస్టీజియస్‌గా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది.
ఈ సినిమా షూటింగ్ 2025 చివర్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ ప్రస్తుతం ఫైనలైజ్ అవుతుండగా, ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా త్వరలోనే మొదలవనుంది. ఓ సరికొత్త కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాలీవుడ్ ట్రెండ్స్‌కు భిన్నంగా ఉండనుందని, కమర్షియల్ సినిమాల స్టైల్‌ను మార్చే ప్రయత్నమని టీమ్ చెబుతోంది. అభిషేక్ కూడా అలాంటి ప్రయోగాత్మక కథలో నటించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.