సైన్యంతో సరిహద్దుల్లో బంకర్‌లో ఉన్నాను: అమీర్ ఖాన్
పహల్గామ్ దాడి, అనంతరం ఆపరేషన్ సింధూర్ విజయంపై బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
By: Tupaki Desk | 16 Jun 2025 3:17 PM ISTపహల్గామ్ దాడి, అనంతరం ఆపరేషన్ సింధూర్ విజయంపై బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అతడు ముస్లిములు, దాయాది పాకిస్తాన్ కు భక్తుడు అంటూ విమర్శించారు. అయితే సితారే జమీన్ పర్ రిలీజ్ ప్రమోషన్స్ లో తనపై వచ్చిన విమర్శలన్నిటికీ జవాబిచ్చాడు అమీర్ ఖాన్. తాను భారతీయ సైన్యంతో 8రోజులు బార్డర్ లో గడిపానని, అలా చేసిన ఏకైక నటుడిని తాను మాత్రమేనని అన్నాడు. ఒక రాత్రి సైన్యంతో బంకర్ లో ఉన్నానని కూడా అమీర్ అన్నారు. వారితో తిన్నాను.. వారితో నడిచాను. వారి కష్టాలను తెలుసుకున్నాను. వారికి ధైర్యం చెప్పాలనుకున్నాను. కానీ వారే నాకు ధైర్యం చెప్పి పంపారు! అంటూ అమీర్ ఖాన్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
పహల్గామ్ లో ఉగ్రదాడి పిరికిపందల చర్య అని అన్నారు. జాతీయ భద్రతా సమస్యలను చర్చించేటప్పుడు అమీర్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. వారు మన ప్రజలను చంపారు. ఇదేనా మార్గం? ఇది మానవత్వంపై దాడి. వారు ఇలా చేసినందుకు సిగ్గుపడాలి. అమాయక ప్రజలను చంపమని ఏ మతం చెప్పదు. ఇటువంటి చర్యలు ఇస్లాంకు విరుద్ధమని, ఉగ్రవాదులను విశ్వాసంతో మతాన్ని ముడిపెట్టకూడదని ఆయన నొక్కి చెప్పారు.
యుద్ధం తర్వాత కార్గిల్‌లో ఎనిమిది రోజులు ఎలా గడిపాడో కూడా గుర్తుచేసుకున్నాడు. సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి అమీర్ ప్రయత్నించానని అన్నాడు. కానీ వారే నాకు ధైర్యం నేర్పారని తెలిపాడు. కార్గిల్ యుద్ధం తర్వాత నేను లేహ్ మీదుగా శ్రీనగర్ వెళ్లాను. అక్కడ ప్రతి రెజిమెంటులో మన సైన్యాన్ని కలిసాను. సంక్లిష్ఠ వాతావరణంలో వారంతా మన దేశాన్ని కాపాడటానికి ఎంతో పాటుపడుతున్నారు. మాకోసం యుద్ధం చేసి రక్షించారు. అందుకే వారిని ప్రశంసించేందుకు వెళ్లాను... అని తెలిపారు. ఒక రాత్రి సరిహద్దుల్లో బంకర్ లో ఎనిమిది మంది సైనికులతో ఉన్నానని కూడా అమీర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు.
గతంలో టర్కిష్ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగన్‌ను కలిసిన తర్వాత తాను ఎదుర్కొన్న వ్యతిరేకతను కూడా అమీర్ ఖాన్ ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దౌత్య సమావేశాల కోసం విదేశాలలో ప్రజా ప్రతినిధిగా ఉండటంలో భాగమని వివరిస్తూనే, తరువాత టర్కీ చర్యలు, ముఖ్యంగా పాకిస్తాన్‌కు వారి మద్దతు వల్ల కలిగే సమస్యల్ని ఆయన అంగీకరించారు. టర్కీ తప్పు చేసింది... వారికి అవసరమైన సమయంలో మనం స్నేహంగా మెలిగాం. ప్రతిగా వారు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చారు. చాలా తప్పు చేసారు! అని ఆయన వ్యాఖ్యానించారు.