2025 ఫస్టాఫ్ హీరోలు వీరే!
నిన్న కాక మొన్న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినట్టు ఉంది. కానీ అప్పుడే ఏడాదిలో దాదాపు సగం క్యాలెండర్ పూర్తయిపోయింది.
By: Tupaki Desk | 13 Jun 2025 2:00 AM ISTనిన్న కాక మొన్న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినట్టు ఉంది. కానీ అప్పుడే ఏడాదిలో దాదాపు సగం క్యాలెండర్ పూర్తయిపోయింది. ఇందులో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాయని భావించిన కొన్ని పెద్ద హీరోల సినిమాలు బొక్కబోర్లా పడితే, అసలు ఎలాంటి అంచనాలు లేని మరికొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి ఘన విజయాలు సాధించి కలెక్షన్ల సునామీలను సృష్టించాయి.
స్టార్లు, భారీ బడ్జెట్లు లేని చిన్న సినిమాలు సైతం గడిచిన నెలల్లో మంచి విజయాలు సాధించడం విశేషం. అలాంటి కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం. బాక్సాఫీస్ వద్ద ఛావా సినిమా సృష్టించిన కలెక్షన్ల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.780 కోట్లు కలెక్షన్స్‌ను వసూలు చేసిన ఈ సినిమాలో కథ బలం కంటే ఒక మతంకు సంబంధించిన అంశాలే ఆ చిత్రం విజయాన్ని ప్రభావితం చేశాయని సినీ క్రిటిక్స్ మిశ్రమ అభిప్రాయాలను వెల్లడించడం తెలిసిందే.
దీనికి పూర్తి భిన్నంగా కోర్టు డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కేసరి చాప్టర్-2 మూవీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కథతో పాటు అక్షయ్ కుమార్, మాధవన్ నటన ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఎలాంటి అంచనాలు లేకుండా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్టు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ న్యాయాన్ని కూడా ఎలా ప్రభావితం చేయవచ్చు అనే కథను దర్శకుడు రామ్ జగదీష్ అద్భుతంగా తెరకెక్కించి క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు పొందాడు.
నటి సిమ్రన్ మినహా పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని తారాగణంతో తమిళ్‌లో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన విజయం సాధించింది. అత్యంత తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ.82 కోట్లు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది. మళయాలంలో మోహన్‌లాల్ హీరోగా విడుదలైన తుదరం సినిమాకు మిక్డ్స్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. కథ కంటే కూడా మోహన్ లాల్ స్టార్‌డమ్ ఈ సినిమా విజయానికి బాగా పనిచేసింది. రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. మొత్తానికి ఊహించని ఎన్నో సినిమాలు 2025 ఫస్టాఫ్ లో సూపర్ హిట్లుగా నిలిచాయి.