Begin typing your search above and press return to search.

తెలంగాణ లో వారానికి ఐదు రోజులే ...ఎల్ నినో ఎఫెక్ట్ ?

ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వ రంగంలో వారానికి అయిదు రోజులు అమలు చేస్తున్నారు. అదే విధానం తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని జేఏసీ కోరుతోంది.

By:  Satya P   |   31 Oct 2026 9:31 AM IST
తెలంగాణ లో వారానికి ఐదు రోజులే ...ఎల్ నినో ఎఫెక్ట్ ?
X

తెలంగాణా ప్రభుత్వం సూపర్ ఎల్ నినో గురించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. దాని కోసం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారధ్యంలో మంత్రులతో ఒక ఉప సంఘాన్ని కూడా నియమించి ఎల్ నినో వల్ల కలిగే కష్టాల గురించి పరిష్కారాల గురించి నిరంతరం అధ్యయనంచేసేలా చర్యలు తీసుకుంది. అలాగే నీరు విద్యుత్ ఇంధనం వంటివి వాటిలో పొదుపు పాటించాలని ప్రజలకు ప్రభుత్వమే విజ్ఞప్తి చేస్తోంది. దాంతో మరిన్ని కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది.

ప్రభుత్వ ఆఫీసులలో :

ఇప్పటిదాకా చూస్తే తెలంగాణాలోని ప్రభుత్వ ఆఫీసులలో వారానికి ఆరు రోజుల పని దినాలు అమలు అవుతున్నాయి. ఎల్ నినో నేపథ్యంలో దానిని అయిదు రోజులకు కుదిస్తే ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది అంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) తాజ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దాంతో ప్రభుత్వం దీని మీద సీరియస్ గా ఆలోచన చేస్తోందని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం తరహాలో :

ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వ రంగంలో వారానికి అయిదు రోజులు అమలు చేస్తున్నారు. అదే విధానం తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని జేఏసీ కోరుతోంది. ఇక ఎల్‌ నినో ప్రభావంతో నీరు, విద్యుత్‌, ఇంధన పొదుపు అవసరం చాలా ఉందని జేఏసీ గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు 6.30 గంటల చొప్పున వారానికి 39 గంటలు ఉద్యోగులు పనిచేస్తున్నారని జేఏసీ వివరించింది. దీనిని కాస్తా వారానికి అయిదు రోజుల పని విధానంగా అమలు చేస్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రోజుకు 7.30 గంటలు పనిచేసేలా జేఏసీ ప్రతిపాదించింది. ఈ విధంగా వారానికి మొత్తం 37.30 గంటల పని సమయం ఉంటుందని తెలిపింది. అంటే గంటన్నర తక్కువగా అయినా ఆరు రోజుల పని దినాలతో ఇది సమానం అవుతుందని లెక్క చెబుతోంది.

అన్నింటా లాభంగా :

ఈ పని విధానం అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి అన్ని విధాలుగా లాభంగా ఉంటుందని జేఏసీ అభిప్రాయపడుతోంది. అలాగే నీరు, విద్యుత్‌ వినియోగం తగ్గడంతో పాటు కార్యాలయాలకు ఉద్యోగులు రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య తగ్గి రోడ్లపై కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు నీరు, విద్యుత్‌, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని పిలుపు ఇచ్చిన సంగతిని జేఏసీ గుర్తు చేసింది. ఈ మేరకు పరిశీలించాలని జేఏసీ తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. మరి ఎల్ నినో ప్రభావం ఏకంగా ఎనిమిది నెలల పాటు ఉంటుందని అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో జేఏసీ ప్రతిపాదనకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే కనుక వారానికి అయిదు రోజులే ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తాయి అన్న మాట.