భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !
ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ భూమి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీల సెల్సియస్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాలుష్యంలో 75 శాతం వాటా 20 సంపన్న దేశాలదేనని ఐరాస చీఫ్ గుటెర్రెస్ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు తరాలకు భూమిపై జీవనం కష్టమవుతుందని నివేదిక హెచ్చరించింది.
By: Satya P | 19 Nov 2026 10:27 AM ISTఈ మొత్తం విశ్వంలో మానవాళి సహా సమస్త జీవ రాశులు హాయిగా జీవించడానికి అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి. ఈ భూగోళం పచ్చదనంతో పాటు నివాస యోగ్యమైనదిగా ఉంది. అలాంటి భూమికి టాటా చెప్పేయాల్సినేనా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఈ భూమికి పెను ముప్పు పొంచి ఉంది అని అంటున్నారు. ఇది ఎవరో చెప్పిన మాట కానే కాదు గ్లోబల్ వార్మింగ్ నియంత్రణపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ లో అనేక సంచలన విషయాలు కాదు భయంకరమైన విషయాలే ఉన్నాయి. ఈ భూమి సమీప భవిష్యత్తులో మరింతగా వేడెక్కిపోయి ఉష్ణ మండలంగా మారుతుందని నివేదిక తెలియచేస్తోంది.
ఈ శతాబ్దం అంతానికి:
భూమి ఈ శతాబ్దం అంతానికి ఉష్ణ గోళంగా మారుతుందని నివేదిక చెబుతోంది. ఆనాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. భూమిని వేడెక్కకుండా కాపాడుకోవాల్సిన ప్రపంచ దేశాలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నాయని అలాగే ఇచ్చిన హామీలలో కూడా నిలబెట్టుకునే తీరు కనిపించకపోవడమే ఇందుకు కారణం అని నివేదిక చెబుతోంది. భూమిని వేడెక్కించకుండా పరిరక్షించుకుంటామని కేవలం మాటలు చెబుతున్న దేశాలు చేతలలో మాత్రం అది చూపించడం లేదని ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ పేర్కొంది. దీని వల్లనే అంతకంతకు భూమి హీటెక్కిపోతోంది అని ఆందోళన వ్యక్తం చేసింది.
పారిస్ ఒప్పందం ఎక్కడ :
భూమి వేడి ఎక్కడకుండా కాపాడుకోవాలని పేర్కొంటూ చేసుకున్న పారిస్ వాతావరణ ఒప్పందాలను అగ్ర దేశాలు సంపన్న దేశాలు ధిక్కరించి మరీ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ఎత్తి చూపింది. ఇప్పటికే భూమి మీద పర్యావరణంతో పాటు వాతావరణ సమతూల్యత దెబ్బ తిందని స్పష్టం చేసింది. ఇదే తీరు కొనసాగితే మరో 75 ఏళ్ళలో ఈ భూమి నివాస యోగ్యం కాకుండా పోతుందని తేల్చి చెప్పేసింది. టర్కీలోని అంటాల్యా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న కాప్-31 వాతావరణ సదస్సు ఈ విషయాలను స్పష్టం చేసింది. నిజానికి పారిస్ ఒప్పందం ప్రకారం చూస్తే భూమిని కాపాడుకోవడానికి 1.5 డిగ్రీల పరిమితిని కొనసాగించాలని అంతా ఒట్టు పెట్టి మరీ ముందుకు వచ్చారు. ఇపుడు చూస్తే 2.6 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగిపోతూంటే పారిస్ ఒప్పందం పూర్తిగా నీరు కారిపోయినట్లే అని అంటున్నారు.
పరిమితి దాటేశాం :
భూమి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల పరిమితిని దాటకుండా చర్యలను తీసుకోలేకపోయామని ఐక్య రాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పర్యావరణ విధ్వంసం వల్ల మరింత భయంకరమైన ఫలితాలను చూస్తున్నామని ఆయన ఆదోళన వ్యక్తం చేశారు. ప్రకృతి మొత్తం వికృతి అయిందని ఆకస్మిక వరదలతో ఊళ్లకు ఊళ్లను వరదలు ముంచెత్తుతున్నాయని మరో వైపు చూస్తే పెద్ద ఎత్తున చెలరేగే కార్చిచ్చులు అడవులను ఒక్కసారిగా బూడిద చేస్తున్నాయని ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర స్థాయిలో ఆవేదన చెందారు. అయితే భూమి ఈ తీరున వేడెక్కిపోవడానికి పేద దేశాలు కారణ కాదని ఆయన అన్నారు. కానీ ఈ భయంకర ఫలితాలకు మాత్రం పేద బీద దేశాలలోని అమాయక ప్రజలే అందరి కంటే ఎక్కువగా బలి అవుతున్నారని ఆయన బాధ వ్యక్తం చేశారు.
బడా దేశాల పుణ్యమే :
ఈ రోజున భూమి పడుతున్న కష్టాలకు అగ్ర దేశాలే కారణం అని ఆంటోనియో గుటెర్రెస్ ఆరోపించారు. భూమిని హీటెక్కిస్తున్న కాలుష్యంలో ఏకంగా ముప్పాతిక శాతం వాటా కేవలం 20 సంపన్న దేశాలదే అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే భారత్ కానీ రష్యా కానీ ఇతర యూరప్ దేశాలు కానీ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం స్వార్థపూరితంగా పెత్తందారీతనంగా వ్యవహరిస్తోందని ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అసలు వాస్తవాలను బయటపెట్టింది. అమెరికా తీరు చూస్తే పారిస్ ఒప్పందం నుంచి తానుగా తప్పుకోవడమే కాకుండా మరో వైపు బొగ్గు, చమురు వాడకాన్ని విపరీతంగా పెంచుతూ పోతోందని నివేదికలో పేర్కొన్నారు. అలా భూమికి మరింత వేడి రాజేసి అగ్గి పెడుతున్నారని ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ విధంగా చేస్తే రేపటి రోజున ప్రకృతి ప్రకోపానికి అమెరికా లాంటి అగ్ర రాజ్యం అయినా ఏ ఇతర దేశమైనా సంభవించే పెను విపత్తు నుంచి అసలు తప్పించుకోలేరని వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు తమ స్వార్థం వీడాలని భవిష్యత్ తరాలకు బతుకుని ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సదస్సు పిలుపు ఇచ్చింది.
