Begin typing your search above and press return to search.

రాబోయే 72 గంటలు ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకం.. మరో తుఫాన్ ఎక్కడ తీరం దాటుతోందంటే?

వాతావరణ నిపుణుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం నవంబర్ 2 లేదా 3 నాటికి తీవ్ర తుఫానుగా మారనుంది.

By:  A.N.Kumar   |   1 Nov 2026 9:41 AM IST
రాబోయే 72 గంటలు ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకం.. మరో తుఫాన్ ఎక్కడ తీరం దాటుతోందంటే?
X

ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ల ముప్పు విశ్రాంతినిచ్చేలా లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. ఒక తుఫాను తెచ్చిపెట్టిన నష్టం నుంచి రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా తీరప్రాంత జనాలు ఇంకా కోలుకోనేలేదు. ఇంతలోనే మరొక తీవ్ర వాయుగుండం బంగాళాఖాతంలో వేగంగా బలపడుతూ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఇది తుఫానుగా రూపాంతరం చెంది తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. దాంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా వాతావరణ అత్యవసర పరిస్థితిని పోలిన పరిస్థితులు నెలకొన్నాయి.

వాతావరణ నిపుణుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం నవంబర్ 2 లేదా 3 నాటికి తీవ్ర తుఫానుగా మారనుంది. ఇది మధ్య కోస్తాంధ్రలోని మచిలీపట్నం, బాపట్ల మధ్య తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయానికి ఈ గాలుల వేగం గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వరకు చేరే ప్రమాదం ఉంది. సాధారణ తీర ప్రాంతాల్లో కూడా 45 నుండి 65 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్లు నేలకూలడం.. విద్యుత్ స్థంభాలు దెబ్బతినడం వంటి విపత్తులు సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ తుఫాను కారణంగా నవంబర్ 1 నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. సోమవారం అత్యంత ప్రభావవంతమైన రోజుగా ఉండనుంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తీవ్ర నుంచి అతి తీవ్ర వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. అలాగే తూర్పు గోదావరి, కోనసీమ, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాలనూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. మంగళవారం రోజు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం కొనసాగుతుంది.

ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని.. ఇప్పటికే వేటలో ఉన్నవారు వెంటనే సమీప తీరాలకు తిరిగి రావాలని స్పష్టం చేశారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు.. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల వేళ చెట్ల కింద నిలబడకూడదని.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా కేవలం అధికారిక ఐఎండీ బులెటిన్లను మాత్రమే అనుసరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే 72 గంటలు ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి.