Begin typing your search above and press return to search.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అయ్యే అవకాశాలున్నాయని అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు మైఖేల్ ప్రీమాన్ సంచలన విశ్లేషణ చేశారు. పోస్టుమార్టం ఫొటోలు, వైద్య ఆధారాల్లోని గాయాలు గొంతు నులిమినట్లు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. 2019లో జైల్లో జరిగిన ఆయన మరణంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  A.N.Kumar   |   17 Nov 2026 6:16 PM IST
జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం
X

జెఫ్రీ ఎప్ స్టీన్.. సె*క్స్ రాకెట్ తో ప్రపంచంలోని అందమైన యువతులను అమెరికాకు తీసుకొచ్చి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఎరవేసి కోట్లు సంపాదించిన ఓ ఫేమస్ బ్రోకర్.. ప్రపంచవ్యాప్తంగా ఇతడి వ్యవహారాలు వెలుగుచూడడంతో ఈ హై ప్రోఫైల్ సెక్స్ రాకెట్ పెను సంచలనం సృష్టించింది. 2019 ఆగస్టు 10న న్యూయార్క్ లోని మన్ హట్టన్ జైలుగదిలో ఎప్ స్టీన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా అధికారులు అప్పట్లో అధికారికంగా ప్రకటించి ఈ హైప్రోఫైల్ కేసును గుట్టుచప్పుడు కాకుండా ముగించడం చర్చనీయాంశమైంది. ఎప్ స్టీన్ బతికుండి కోర్టులో నోరువిప్పితే అమెరికా దిగ్గజాల శృంగార చరిత్ర మొత్తం బయటపడేది. అందుకే అతడిని చంపేసి ఉంటారని అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి..

అయితే ఆయన మరణించి ఏడేళ్లు గడుస్తున్నా ఆ మిస్టరీ ఇప్పటికీ వీడడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ మైఖేల్ ప్రీమాన్ వెల్లడించిన సంచలన విశ్లేషణ ఈ కేసును మళ్లీ మొదటికి తీసుకొచ్చింది. ఎప్ స్టీన్ ది ఆత్మహత్య కాదని.. అది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అయ్యే అవకాశాలున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో బాంబుపేల్చారు. ఇప్పుడు ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రొఫెసర్ మైఖేల్ ప్రీమాన్ తన పరిశోధనలో భాగంగా ఎప్ స్టీన్ శవ పరీక్ష ఫొటోలు, 3డీ నమూనాలు, ఇతర వైద్య ఆధారాలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన దృష్టికి కొన్ని కీలక అంశాలు వచ్చాయి. ముఖ్యంగా ఎప్ స్టీన్ మెడపై స్పష్టంగా కనిపిస్తున్న ‘వై’ ఆకారపు గుర్తు, గోళ్లతో గీసినట్టుగా ఉన్న గీతలు.. ముఖంపై గాయాలు.. అలాగే ఎడమ భుజం, వీపు భాగంగా జరిగిన తీవ్ర అంతర్గత రక్తస్రావం వంటివి ఆత్మహత్య చేసుకున్నాడు అనడానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రీమాన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.

సాధారణంగా ఉరివేసుకున్నప్పుడు ఏర్పడే గాయాల కంటే ఎవరైనా బలంగా గొంతునులిమి , ఆపై మెడకు తాడు బిగించి చంపినప్పుడు ఇలాంటి గాయాలు ఏర్పడుతాయని ఆయన విశ్లేషించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారని.. దీనిపై తక్షణమే పునర్విచారణ చేపట్టాలని ఆయన అధికారులను కోరడం సంచలనమైంది.

ఎప్ స్టీన్ చావకపోతే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే ఇతడిని అంతమొందించినట్టు అనుమానాలున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులతో ఎప్ స్టీన్ కు సన్నిహిత సంబంధాలుండేవి. మైనర్ బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే జైల్లో అనుమానాస్పద స్థితిలో మరనించడంతో ఎన్నో కీలక రహస్యాలను సమాధి చేసినట్టైంది.

ఇక ట్విస్ట్ ఏంటంటే.. ఎప్ స్టీన్ మరణానికి ముందు జైలు గది బయట ఉన్న రెండు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం.. పుటేజీలో మూడు నిమిషాల పాటు అంతరాయం కలగడం.. అలాగే విధుల్లో ఉన్న జైలు సిబ్బంది నిర్లక్ష్యం వహించడం అప్పట్లోనే ఈ అనుమానాలకు బీజం వేసింది.

అయితే న్యూయార్క్ వైద్య పరీక్ష విభాగం.. దర్యాప్తు సంస్థలు ఎప్ స్టీన్ ది ఆత్మహత్య అని కేసును క్లోజ్ చేశాయి. ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం పోస్టుమార్టం రిపోర్టు చూసి ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. తాజా ఫోరెన్సిక్ నిపుణుడి విశ్లేషణతో నాటి జైలు భద్రతా లోపాలు.. ఆకస్మిక మరణం వెనుక దాగి ఉన్న అసలు నిజాలపై మరోసారి ప్రశ్నల వర్షం కురుస్తోంది. పారదర్శకమైన లోతైన దర్యాప్తు జరిగితేనే తప్ప ఈ శతాబ్దపు అతిపెద్ద మిస్టరీకి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.