విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..
అమెరికాలో సాంకేతిక సమస్యలతో వేలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఆధునికీకరించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సమస్య పరిష్కారానికి 50 బిలియన్ డాలర్లతో కొత్త వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ట్రంప్, బైడెన్ మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.
By: A.N.Kumar | 16 Nov 2026 12:25 PM ISTట్రంప్ మళ్లీ ఏసాడు.. క్రెడిట్ లు అన్నీ తాను తీసుకొని.. తన హయాంలో జరిగిన వైఫల్యాలను మాత్రం పాత అధ్యక్షుడు బైడెన్ పై నెట్టేశాడు. కావాల్సినంత బురద చల్లుతాను.. కడుక్కోవడం నీ ఖర్మ అంటూ తనకు తోచిన స్టైల్ లో ట్రంప్ తాత వికటట్టహాసం చేశాడు. రివార్డులు నాకు.. తిట్లు నీకు అంటూ నూకిపడేశాడు. అట్లుంటదీ ట్రంప్ తోని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అమెరికా అంటే అగ్రరాజ్యం.. అంతరిక్షం నుంచి కృత్రిమ మేధస్సు వరకు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న దేశం. తోపు కంట్రీ అని కాలర్ ఎగరేసుకొనే తిరిగే వారు చాలా మంది ఉంటారు. కానీ విమానయాన రంగం విషయానికి వస్తే మాత్రం పరిస్థితి చూస్తే నవాబుల కాలం నాటి జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. దేశవ్యాప్తంగా విమానాలు గంటల తరబడి నిలిచిపోవడం.. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాయడం చూస్తుంటే.. టెక్నాలజీ గురువైన అమెరికాలో అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్న తలెత్తక మానదు. ఒకవైపు విమానాలు ఆకాశంలో ఎగరడం ఆగిపోయినా.. మరొకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మధ్య విమర్శల రాకెట్లు మాత్రం జెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
శుక్రవారం అమెరికా వ్యాప్తంగా చోటుచేసుకున్న విమానయాన అంతరాయం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సాంకేతిక వ్యవస్థలో అప్‌గ్రేడ్ ప్రక్రియ వికటించడంతో అధికారులు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో వారాంతంలోనూ వేలాది విమానాలు రద్దయ్యాయి. సాధారణంగా విమానం ఆలస్యమైతే వాతావరణంపై నెపం నెట్టేయొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా టెక్నాలజీనే హ్యాండ్ ఇవ్వడంతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు జర్నీ కంటే ఎయిర్‌పోర్టు కుర్చీలపై ఎదురుచూపులే ఎక్కువయ్యాయి.
ఇక ఈ సాంకేతిక మొండిఘటంపై అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ వెంటనే తనకు తెలిసిన ఫస్ట్రషన్ తో ఊగిపోయారు.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నిర్వహణలో బైడెన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారే తప్ప.. పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఆధునికీకరించలేదని విమర్శల వర్షం కురిపించారు. సమస్య పరిష్కారం కోసం ఏకంగా 50 బిలియన్ డాలర్లతో సరికొత్త వ్యవస్థను తీసుకొస్తామని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. చిన్నచిన్న మరమ్మతులతో కాలయాపన చేయకుండా భారీ ప్రాజెక్టును చేపడతామంటున్నారు.
టెక్నికల్ సమస్య తలెత్తితే నిపుణులు సమీక్షించాలి.. భవిష్యత్తులో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి. కానీ అమెరికాలో మాత్రం తప్పంతా గత ప్రభుత్వానిదా? లేక ప్రస్తుత పాలకుల ముందస్తు వైఫల్యమా? అనే చర్చపైనే రాజకీయ నాయకులు దృష్టి పెట్టారు. బైడెన్ హయాంలోని లోపాలను ఎత్తిచూపుతూ ట్రంప్ తన రాజకీయ పబ్బం గడుపుకుంటుంటే.. ఎయిర్‌పోర్టుల్లో లగేజీతో అల్లాడిపోతున్న ప్రయాణికులకు మాత్రం ఈ పొలిటికల్ పంచ్ డైలాగ్‌లతో ఒరిగేదేమీ లేదు.
అమెరికాలో విమానాలు రన్‌వేపై కదలకపోయినా నాయకుల మాటల తూటాలు మాత్రం భరతవాక్యంగా మారుతున్నాయి. అగ్రరాజ్యం ఆకాశంలో హవా చెలాయించాలన్నా.. ప్రయాణికుల గుండెల్లో టెన్షన్ తగ్గించాలన్నా.. ముందుగా కింద ఉన్న విమానాశ్రయాల్లోని సాప్ట్వేర్ గోలని సెట్ చేసుకుంటేనే బెటర్..
