అమెరికాలో ‘మన స్టైల్’ ప్రచారం.. దోశలేశారు.. ఇక పిల్లల ముడ్డి కడగడమే మిగిలింది?
ఓటరు దేవుడు కనిపిస్తే చాలు.. నాయకుడికి చేతిలో ఉన్న దోశల పెనం కూడా ఒక మైక్‌లా మారిపోతుందనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ.
By: A.N.Kumar | 31 Oct 2026 12:12 PM ISTఅమెరికాలో ప్రచారం ఎలా ఉంటుంది.. ఒక పెద్ద గ్రౌండ్ లేదా ఇండోర్ స్టేడియంలో మధ్యలో పోటీచేసే అభ్యర్థి నిలబడితే.. చుట్టూ గుండ్రంగా జనాలు కూర్చొని మనోడి వీరావేశా స్పీచులకు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసే సీన్లే ఉండేవి. కానీ కాలం మారింది. అమెరికాలోనూ మన భారతీయ ఎన్నికల ప్రచార సరళి తాజా మిడ్ టర్న్ ఎన్నికల్లో కనిపిస్తోంది. భారతీయులు ఎక్కువగా ఉండే డలాస్ లో తాజాగా ఓ డెమొక్రటిక్ అభ్యర్థి ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లి ఓట్ల కోసం దోశలు వేయడం వైరల్ అయ్యింది. అమెరికా రాజకీయాల్లో మన దేశీ ‘ఎన్నికల మసాలా’ ఘుమఘుమలాడుతోందనడానికి ఇదే నిదర్శనం..
మన దగ్గర ఎన్నికలొస్తే చాలు.. నాయకులు టీ కొట్టులో టీ కలుపుతూ.. రోడ్డు పక్కన బండ్లపై దోశలేస్తూ.. పొలాల్లో నాట్లు వేస్తూ జనం ముందుకు రావడం పాత కథే. ఇప్పుడు అచ్చం ఇదే ఫార్ములాను అగ్రరాజ్యం అమెరికా నేతలు కూడా కాపీ కొట్టేస్తున్నారు. అక్కడి రాజకీయ నాయకులను చూస్తుంటే మన దేశీ పొలిటీషియన్లకు డూప్‌లా కనిపిస్తున్నారు.
అమెరికాలో ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ప్రజాస్వామ్యం కాస్తా ‘దేశీ కిచెన్’గా మారిపోయింది. ముఖ్యంగా ఇండో-అమెరికన్ ఓటర్లను బురిడీ కొట్టించేందుకు అభ్యర్థులు భారతీయ సంస్కృతిపై ఒక్కసారిగా ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ టలారికో చేసిన విన్యాసం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డాలస్‌లోని ఒక ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన పొలిటికల్ స్పీచ్‌లు పక్కనబెట్టి నేరుగా వంటగదిలోకి దూరిపోయారు. అక్కడ పొగలు కక్కే పెనంపై వేడివేడిగా దోశలేసి, స్వయంగా కస్టమర్లకు వడ్డించారు. ఆయన చేసిన రచ్చ చూసి అక్కడ ఉన్నోళ్లంతా ఆయన నాయకుడో లేక కొత్తగా చేరిన చెఫో అర్థం కాక తలలు పట్టుకున్నారు. తేడా ఒక్కటే.. మన దగ్గర ఓట్ల కోసం బిర్యానీల పంపిణీ జరిపితే అక్కడ మాత్రం ప్రచారంలో దోశలు కాలుతున్నాయి.
మరోవైపు మన నేతల తరహాలోనే గుళ్లు, గోపురాలు చుట్టూ తిరగడం కూడా మొదలైంది. నిన్నటివరకు ఇటువైపు కూడా చూడని నేతలు.. ఇప్పుడు ముందస్తు దీపావళి వేడుకలకు హాజరవుతూ సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు. సెనేటర్ కోరీ బ్రూకర్ లాంటి వారు దీపాల పండుగకు ముందే పొలిటికల్ దీపాలు వెలిగిస్తూ భక్తులతో మమేకమైపోతున్నారు. మన దగ్గర నాయకులు ఓట్ల కోసం చర్చిలు, మసీదులు, గుళ్ల బాట పట్టినట్లే.. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.
ఓటరు దేవుడు కనిపిస్తే చాలు.. నాయకుడికి చేతిలో ఉన్న దోశల పెనం కూడా ఒక మైక్‌లా మారిపోతుందనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ. ఎన్నికల ముందు ఇలా రెస్టారెంట్లలో దోశలు వేయడం, పండుగల్లో సందడి చేయడం బాగానే ఉంది గానీ.. గెలిచాక కూడా వీళ్లు ఇదే ప్రేమతో ఇండియన్ ఫుడ్ తింటారా? లేక జనం జేబులకు ‘దోశ’ పెట్టి గాలికి వదిలేస్తారా? అన్నదే అసలు ప్రశ్న.
ఓట్ల కోసం దోశలేశారు.. దేవాలయాల చుట్టూ తిరిగారు.. ఇక మిగిలింది మన నేతల తరహాలో వీధుల్లోకి వచ్చి చిన్న పిల్లల ముడ్డి కడగడం.. ముసలమ్మలకు ముద్దులు పెట్టడం.. రోడ్లు ఊడవడం మాత్రమే.. అప్పుడు కానీ అమెరికా ఎన్నికల ప్రచారం 100% ‘భారతీయ మార్కు’ పూర్తి చేసుకోదు. ఓటు మహిమ ఎంతటి అగ్రరాజ్య నేతనైనా దోశల మాస్టర్లా మార్చేస్తుందని ఈ ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది..
