మళ్లీ టారిఫ్ లా? కుక్కతోక వంకర.. ఈ ట్రంప్ బుద్ది ఇక మారదా?
భారత్ సహా 14 దేశాలపై కొత్తగా టారిఫ్లు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెక్షన్ 301 కింద ఈ వారంలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. ఈ సుంకాల ప్రభావం భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాలు, వస్త్రాలు, రసాయనాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులపై పడే అవకాశం ఉంది.
By: A.N.Kumar | 25 Nov 2026 12:36 PM ISTపుట్టుకతో వచ్చిన బుద్ది పుర్రె కాలేదాక పోదంటారు.. ఈ ట్రంప్ బుద్ది అసలు మారదబ్బా.. ఎప్పుడు ఏ మూడ్ వస్తుందో..? ఎప్పుడు ఎవరిమీద పడుతాడో అసలు ఆయనకే అర్థం కావడం లేదు. మొన్నటి మిడ్ టర్మ్ ఎన్నికల్లో జనాలు కర్రుకాల్చి చిత్తుగా ఓడించినా ఇంకా బుద్ది రాలేదు ఈ మహాశయుడికి.. ఎవరైతే అమెరికాకు శత్రువులో వారితోనే కలుస్తాడు. ఎవరైతే మిత్రులో వారినే దూరం పెడుతాడు.. ట్రంప్ చేష్టలు అమెరికాకే కాదు ప్రపంచంలోని దేశాలకు పెను శరాఘాతంగా కనిపిస్తున్నాయి..
ట్రంప్ తొలి టర్మ్ లో భారత్ ను, మోడీని మిత్రుడిగా ట్రంప్ సహకారం మరువలేనిది.. మన మోడీ అయితే అమెరికా వెళ్లి ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం ‘హౌడీ మోడీ’ కూడా చేసి వచ్చాడంటే వీరి ఫ్రెండ్ షిప్ ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ రెండోసారి ట్రంప్ గెలిచాక భారత్ ను శత్రువుగా.. చైనాను మిత్రుడిగా చూస్తూ.. పాకిస్తాన్ కు పాలు పోస్తూ భారత్ ను ఏడిపించేస్తున్నాడు. ప్రతీ విషయంలోనూ భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు మాటలు అంటూ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా గంతులేసేస్తున్నాడు.
ఇప్పటికే 100 శాతం టారిఫ్ లు అంటూ భారత్ సహా ప్రపంచ దేశాలపై వేయడం.. కోర్టుల్లో అవి వీగిపోవడం.. ఆయన ఆగకుండా తెల్లారి లేస్తే పన్నుల మోత మోగిస్తూ ట్రంప్ ఏం సాధిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. జనాలు ఈయన చేష్టలకు డెమొక్రటిక్ పార్టీని ఓడించినా ఇంకా ఏం చూసుకొని ఇలాంటి పన్నులు వేస్తున్నాడో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి.
తాజాగా మరోసారి ప్రపంచ దేశాలకు టారిఫ్ లు షాక్ ఇచ్చేందుకు ట్రంప్ నూరుతున్నాడు. భారత్ సహా 16 దేశాలపై కొత్తగా టారిఫ్ లు విధించనున్నారట.. దీనివల్ల భారత్ పై 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ దిగుమతి సుంకం పడే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు బాంబు పేల్చాయి. ఇప్పటికే ట్రంప్ విధిస్తున్న సుంకాలకు చెక్ పెడుతూ అక్కడి కోర్టులు రద్దు చేశాయి. దీంతో ఎక్కడ లూప్ హోల్ ఉందని వెతికిన ట్రంప్ ఇప్పుడు ‘సెక్షన్ 301’ అనే కొత్త అస్త్రాన్ని బయటకు తీసి వేయడానికి రెడీ అయ్యాడు.
భారత్, చైనా, సౌత్ కొరియా,జపాన్, యూరప్ దేశాలపై ఈ టారిఫ్ సుంకాలు వేసేందుకు రంగం సిద్ధం చేశాడట.. ఇవన్నీ చీప్ గా వస్తువులను తయారు చేసి అమెరికా మార్కెట్ లో చౌకగా విక్రయించి అమెరికా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ ఊగిపోతూ ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడట.. ఈ వారంలో సెక్షన్ 301 అమలు చేస్తూ టారిఫ్ లు వేస్తామని అమెరికా వాణిజ్యప్రతినిధి జేమిసన్ గ్రీర్ మీడియాకు వెల్లడించడంతో ఈ ట్రంప్ బుద్ది మళ్లీ మారదని అర్థమైపోయింది.
ఇప్పటికే భారత్ తో వాణిజ్య డీల్ మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అనేలా సాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ భారత్ పై టారిఫ్ లు వేస్తే అసలు ట్రంప్ హయాంలో అమెరికాతో వాణిజ్య డీల్ అవ్వడం కష్టమే.. ట్రంప్ పోయేదాకా ఆగుతామంటూ ఇప్పటికే మన దేశ వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించాడు.
భారత్, చైనా,యూరప్ దేశాలు సహా 14 దేశాలపై ఈ టారిఫ్ లు అమలుకానున్నాయి. ఈ టారిఫ్ లతో భారత్ నుంచి అమెరికా వెళ్లే మెడిసన్స్, టెక్స్టైల్స్ , కెమికల్స్, ఇంజినీరింగ్ గూడ్స్ రంగాలపై ఈ టారిఫ్ ల భారం పడి వాటి ధరలు పెరుగనున్నాయి. అంతిమంగా అమెరికన్ల మీద వీటి భారం పడనుంది. భారత్ వస్తువుల ధరలు ప్రియం అయిపోయి మన ఎగుమతులకు కష్టకాలం కానుంది.
