Begin typing your search above and press return to search.

విమానం ల్యాండింగ్‌కు రెడీ.. అంతలోనే భూకంపం.. పైలట్ సాహసం.. వైరల్ వీడియో

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1972 ల్యాండింగ్‌కు సిద్ధమైంది. రన్‌వేపై ప్రమాదాన్ని గుర్తించిన ఏటీసీ అధికారులు పైలట్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే ల్యాండింగ్ నిలిపివేసి విమానాన్ని తిరిగి గాల్లోకి మళ్లించారు. దీంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

By:  A.N.Kumar   |   29 Nov 2026 4:29 PM IST
విమానం ల్యాండింగ్‌కు రెడీ.. అంతలోనే భూకంపం.. పైలట్ సాహసం.. వైరల్ వీడియో
X

ఆకాశంలో ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో.. ఆ విమానం తిరిగి సురక్షితంగా నేలను తాకే ఆఖరి నిమిషాలు అంతకంటే ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఒక చిన్న సాంకేతిక లోపం లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినా ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఒక అసాధారణ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమానయాన ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు నేల కంపిస్తుంటే.. మరోవైపు రన్‌వేపై దిగబోతున్న విమానాన్ని క్షణాల్లో తిరిగి ఆకాశంలోకి మళ్లించి.. వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఆ సాహసోపేత పైలెట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అది శనివారం ఉదయం సుమారు 9:30 గంటల సమయం. అమెరికాలోని గ్రేటర్ లాస్ ఏంజెల్స్ ప్రాంతం ఎప్పటిలాగే తన దైనందిన కార్యకలాపాలతో సందడిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం నగరాన్ని కుదిపేసింది. ఇళ్లు, భవనాలు, రహదారులే కాదు.. విమానాశ్రయ రన్‌వేలు సైతం ఈ ప్రకంపనల ధాటికి ఊగిపోయాయి. భూకంపం రావడం వల్ల రన్‌వేలపై పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.. ఇది ల్యాండ్ అయ్యే విమానాలకు అత్యంత ప్రమాదకరం.

భూకంపం సంభవించిన సరిగ్గా అదే క్షణంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1972 లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. విమానం రన్‌వేకు అత్యంత సమీపంలోకి చేరుకుంది. మరికొద్ది సెకన్లలో విమానం చక్రాలు నేలను తాకబోతున్నాయి. అయితే విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు భూకంప తీవ్రతను వెంటనే గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫ్లైట్ 1972 పైలట్‌ను అప్రమత్తం చేశారు. "రన్‌వేపై ల్యాండ్ కావద్దు.. వెంటనే ల్యాండింగ్ నిలిపివేయండి" అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

సాధారణంగా ల్యాండింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నప్పుడు విమానాన్ని తిరిగి గాల్లోకి లేపడం అంత సులభమైన విషయం కాదు. దానికి ఎంతో నైపుణ్యం.. గుండె ధైర్యం కావాలి. ఏటీసీ నుండి హెచ్చరిక అందిన మరుక్షణమే పైలట్ ఏమాత్రం తడబడలేదు. పరిస్థితి తీవ్రతను రెప్పపాటులో అంచనా వేశారు. వెంటనే ఇంజిన్ల వేగాన్ని పెంచి.. నేలను తాకబోతున్న విమానాన్ని తిరిగి ఆకాశం వైపు మళ్లించారు. పైలట్ తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంతో విమానం ప్రమాదకరమైన రన్‌వేపై దిగకుండా సురక్షితంగా గాల్లోకి ఎగిరింది.

ఈ భూకంపం తర్వాత విమానాశ్రయ అధికారులు తక్షణమే అన్ని టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లను నిలిపివేశారు. ఇంజనీర్లు రన్‌వేలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఎక్కడా పగుళ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాతే విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. కాలిఫోర్నియా భూకంప ప్రభావిత ప్రాంతమైనప్పటికీ అధికారుల అప్రమత్తత వల్ల ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

ఈ ఏటీసీ ఆడియో సంభాషణలు.. విమానం చాకచక్యంగా తిరిగి గాల్లోకి లేచిన వీడియో వైరల్‌గా మారింది. పైలట్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వందలాది కుటుంబాలకు వెలుగునిచ్చింది. నిజమైన హీరోలు ఇలాగే ఉంటారు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా.. సంక్షోభ సమయంలో ఏటీసీ అధికారుల చురుకుదనం.. పైలట్ సమయస్ఫూర్తి మధ్య ఉండే సమన్వయమే ప్రయాణికులకు అసలైన రక్షణ కవచమని ఈ ఘటన మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.