నిజమే.. ఇండియన్ ఇన్వేషన్కు ఖచ్చితంగా హద్దుల్లేవు.. యూఎస్ లో ఈ వీడియోనే సాక్ష్యం
ముఖ్యంగా ‘Indian Invasion is now at a perfect 100%’ అంటూ ఒకరు పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
By: A.N.Kumar | 1 Nov 2026 10:51 AM ISTఇండియన్స్ ఎక్కడున్నా వినూత్నంగా చేస్తారు. తమ భారతీయ మూలాలను ఎప్పుడూ మరిచిపోకుండా విదేశాల్లోనూ అమలు చేస్తారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎలా ఇనుమడింప చేస్తున్నారో ఎన్నో వీడియోల్లో చూశాం. మనోళ్లు ఎక్కడుంటే అక్కడ సందడి గ్యారెంటీ.. మన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ ను చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు. అవి విదేశీ పండుగలైనా మనోళ్ల క్రియేటివిటీ పీక్స్ అంతే.. ఇప్పుడూ అదే జరిగింది..
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతి రోజురోజుకూ విశ్వవ్యాప్తమవుతోంది. ఒకప్పుడు మన సినిమాలంటే మన దేశానికే.. లేదా కొద్దిపాటి విదేశీ మార్కెట్‌కే పరిమితమనే భావన ఉండేది. కానీ నేడు టెక్నాలజీ, సోషల్ మీడియా, ఓటీటీ వేదికల పుణ్యమా అని మన కథలు, పాత్రలు ఖండాలు దాటి అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన హాలోవీన్ వేడుకలు ఇందుకు మరో అద్దం పట్టాయి. పాశ్చాత్య సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ హారర్ ఫెస్టివల్లో ఓ భారతీయ మహిళ బాలీవుడ్ హిట్ మూవీ ‘స్త్రీ’ గెటప్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది.
అమెరికాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ చివరిలో అత్యంత వైభవంగా జరిగే ‘హాలోవీన్’ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భయంకరమైన దెయ్యాలు, విభిన్న రాక్షస వేషధారణలు, హాలీవుడ్ హారర్ క్యారెక్టర్లతో అక్కడి వీధులు హోరెత్తుతుంటాయి. ఈ వేడుకల్లో తమ సృజనాత్మకతను చాటుకోవడానికి ప్రజలు పోటీ పడుతుంటారు.
అయితే ఈసారి జరిగిన వేడుకల్లో వెస్ట్రన్ కాస్ట్యూమ్స్‌ను కాదంటూ ఓ భారతీయ మహిళ ఎంచుకున్న గెటప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘స్త్రీ’ సినిమాలోని భయపెట్టే.. అదే సమయంలో ఆకట్టుకునే ప్రత్యేక రూపంతో ఆమె అచ్చం ఆ పాత్రలాగే ప్రత్యక్షమయ్యారు. ఈ రూపం అక్కడ ఉన్నవారందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ‘Indian Invasion is now at a perfect 100%’ అంటూ ఒకరు పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంటే మన సంస్కృతి.. మన సినిమా పాత్రల ప్రభావం అమెరికా గడ్డపై కూడా వంద శాతం పాతుకుపోయిందన్న భావనను ఈ వ్యాకం ఎంతో చక్కగా ప్రతిబింబిస్తోంది. ఒకప్పుడు హాలీవుడ్ దెయ్యాల వేషాలు వేసుకున్న మనం.. ఇప్పుడు మన సినిమా పాత్రలతో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి ఎదిగామనే గర్వం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘స్త్రీ’ చిత్రం హారర్ కామెడీ జానర్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విభిన్నమైన కథాంశంతో భయాన్ని.. నవ్వులను పంచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసింది. కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా.. ప్రజల దైనందిన జీవితాల్లోకి.. వేడుకల్లోకి ఆ పాత్రలు చేరిపోతున్నాయనడానికి ఈ ఘటనే చక్కటి నిదర్శనం.
విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు మన సంస్కృతిని.. సినిమాలను ఇలాంటి వేడుకల్లో భాగం చేయడం ద్వారా మన జాతీయతకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్నారు. ఒకప్పుడు విదేశీ సంస్కృతిని అనుకరించే దశ నుంచి.. నేడు మన సంస్కృతిని విదేశీ వేదికలు అనుకరించే స్థాయికి మనం చేరుకున్నాము.
అమెరికాలో ‘స్త్రీ’ వేషధారణతో చేసిన ఈ సందడి కేవలం ఒక సరదా వీడియో మాత్రమే కాదు.. మన సినిమా సత్తా ఏంటో చాటిచెప్పే అద్భుతమైన మైలురాయి. నిజమే.. ఇండియన్ ఇన్వేషన్కు ఖచ్చితంగా హద్దుల్లేవు..
