భూమిపై అతి సుందర ప్రదేశం స్పిటీ వ్యాలీ.. అక్కడ ప్రకృతి ఎలా ఉంటుందంటే?
స్పిటీ వ్యాలీ ప్రయాణంలో చంద్రతాల్ సరస్సును సందర్శించకుండా తిరిగి వస్తే అది అసంపూర్ణమే అవుతుంది.
By: Tupaki Political Desk | 7 April 2026 1:00 PM ISTభూమి మీద ఒక స్వర్గం అంటూ ఉంటే అది ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటీ వ్యాలీనే. సముద్ర మట్టానికి సుమారు 12,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, హిమాలయాల ఒడిలో ఉండే ఈ ప్రాంతం పర్యాటకులకు, ముఖ్యంగా సాహసాలు చేసే వారికి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. టిబెట్ సరిహద్దులకు దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడి సంస్కృతిలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడారి లాంటి పర్వతాలు, పైన నీలి ఆకాశం, మధ్యలో మంచుతో నిండిన శిఖరాల మధ్య బైక్ మీద ప్రయాణిస్తుంటే కలిగే ఆ మజానే వేరు. చూట్టూ నిర్జీవంగా కనిపించే బూడిద రంగు కొండలు, వాటిపై తెల్లటి మంచు కిరీటాలు, కింద పారే నీలిరంగు నదులు.. ఈ దృశ్యం చూస్తుంటే మనం భూమి మీద ఉన్నామా? లేక వేరే ఏదైనా గ్రహం మీద ఉన్నామా? అనే సందేహం కలగక మానదు. సాహసం ఊపిరిగా బతికే వారికైనా, మనశ్శాంతిని వెతుక్కునే వారికైనా ఈ ప్రాంతం ఒక అద్భుత కావ్యంలా అనిపిస్తుంది.
ప్రకృతి అందాలు అడ్వెంచర్ స్పోర్ట్స్
స్పిటీ వ్యాలీని సందర్శించడానికి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలం అత్యంత అనుకూలమైనది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్తాయి కాబట్టి, వేసవిలో వెళ్లడమే ఉత్తమం. కాజా, లంగ్జా, కిబ్బర్ వంటి గ్రామాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కిబ్బర్ మరియు లంగ్జాలో ట్రెకింగ్, క్యాంపింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంతో ప్రసిద్ధి. అలాగే లంగ్జా గ్రామంలో దొరికే పురాతన శిలాజాలు చరిత్ర ప్రేమికులను ఆకట్టుకుంటాయి.
స్పిటీ వ్యాలీని ‘చిన్న టిబెట్’ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ బౌద్ధ సంస్కృతి అంతలా పాతుకుపోయింది. వెయ్యి ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ‘తాబో మొనాస్టరీ’ ఇక్కడి ప్రత్యేకత. మట్టితో కట్టిన ఈ మఠం లోపల ఉండే అద్భుతమైన పేయింటింగ్స్, శిల్పాలు ఆనాటి కళా వైభవానికి నిదర్శనం. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, బౌద్ధ భిక్షువుల ప్రార్థనలు పర్యాటకుల మనసులోని ఒత్తిడిని తొలగించి సరికొత్త శక్తిని నింపుతాయి.
ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ - హిక్కిం
స్పిటీ వ్యాలీ వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన మరో ప్రదేశం హిక్కిం గ్రామం. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్ ఉంది. సముద్ర మట్టానికి సుమారు 14,400 అడుగుల ఎత్తులో ఉండే ఈ పోస్టాఫీస్ నుంచి మీ ప్రియమైన వారికి ఒక పోస్ట్ కార్డ్ పంపడం అనేది మర్చిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. డిజిటల్ యుగంలో ఉన్నా, ఇంత ఎత్తులో ఉత్తరాలు పంపడం అనేది పర్యాటకులకు ఒక వింత అనుభూతిని ఇస్తుంది.
చంద్రతాల్ సరస్సు
స్పిటీ వ్యాలీ ప్రయాణంలో చంద్రతాల్ సరస్సును సందర్శించకుండా తిరిగి వస్తే అది అసంపూర్ణమే అవుతుంది. చంద్రుడి ఆకారంలో ఉండే ఈ సరస్సు సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండి, పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి నీరు పగటిపూట ఆకాశ రంగును బట్టి మారుతూ ఉండడం ఒక వింత అనుభూతి. ఈ సరస్సు ఒడ్డున క్యాంపింగ్ చేస్తూ, రాత్రివేళ నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూడటం పర్యాటకులకు ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
అయితే, ఇంత ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి, అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి (Acclimatization) కనీసం ఒక రోజు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి, సాహసాలతో కూడిన ప్రయాణం ఇష్టపడే వారికి స్పిటీ వ్యాలీ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ 'కోల్డ్ డెసర్ట్'ను సందర్శించి తీరాల్సిందే.
