ఇంధన ధరల మోతతో ఇండిగో ఛార్జీలకు రెక్కలు.. ఎంతంటే?
పెంచిన టికెట్ ధరలు దూరానికి అనుగుణంగా టికెట్ ధరల పెంపు ఉండనుంది. దేశీయ.. అంతర్జాతీయ రూట్లలో నడిచే అన్ని విమానాలకు ఈ పెంపు ఉంటుంది.
By: Garuda Media | 6 Oct 2026 10:18 AM ISTదేశీయ విమాన రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే ఇండిగో.. తాజాగా చేదువార్తను చెప్పింది. తమ ప్రయాణికుల మీద టికెట్ ఛార్జీల పెంపు భారాన్ని మోపుతున్నట్లుగా స్పష్టం చేసింది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో వాటా సుమారు 65 శాతానికి పైనే. దేశీయంగా విమానాల్లో ప్రయాణించే ప్రతి పది మంది విమాన ప్రయాణికుల్లో ఆరుగురు ప్రయాణికులు ఇండిగో విమానాల్లోనే ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం 440కు పైగా విమానాల భారీ నెట వర్క్ ను నిర్వహిస్తున్న ఇండిగో.. భవిష్యత్ అవసరాల కోసం వెయ్యికి పైగా కొత్త విమానాల్ని ఆర్డర్ చేసి వార్తల్లో నిలిచింది.
ఈ రోజు నుంచి అమలు చేస్తున్న కొత్త టికెట్ ధరల కారణంగా ఏడాది వ్యవధిలో ఇండిగో ప్రయాణికులపై పడే అదనపు భారం ఏకంగా రూ.2వేల కోట్ల నుంచి రూ.2500 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకిలా? అంటే.. విమాన ఇంధనం ధరలు నెలలో పద్నాలుగు శాతానికి పైనే పెరగటంతో ఈ భారాన్ని ప్రయాణికులపై మోపింది ఇండిగో. ప్రయాణించే దూరాన్ని అనుసరించి ఒక్కో విమాన టికెట్ పై కనీసం వంద నుంచి రూ.350 వరకు ఉంటుందని చెప్పినా.. అదనపు ఛార్జీలు మొత్తం కలుపుకొని కనిష్ఠంగా రూ.300-400 భారంతో టికెట్ ధరల పెంపు ఉంటుందని చెబుతున్నారు.
పెంచిన టికెట్ ధరలు దూరానికి అనుగుణంగా టికెట్ ధరల పెంపు ఉండనుంది. దేశీయ.. అంతర్జాతీయ రూట్లలో నడిచే అన్ని విమానాలకు ఈ పెంపు ఉంటుంది. ఏప్రిల్ లో టికెట్ ధరలు పెంచిన ఆర్నెల్లకే మరోసారి టికెట్ ధరల పెంచుతూ ఇండిగో నిర్ణయం తీసుకుంది. 500కి.మీ. వరకు ఉండే మార్గాలపై రూ.375, 501-1000 కి.మీ. దూరానికి రూ.600, 1001-1500కి.మీ. దూరానికి రూ.600, 1001-1500కి.మీ. దూరానికి రూ.900, 1501 -2000 కి.మీ. దూరానికి 1150, 2వేల కి.మీ. అంతకంటే ఎక్కువ దూరానికి రూ.1300 చొప్పున సర్ ఛార్జీ వర్తించనుంది. ఇక అంతర్జాతీయ సర్వీసుల విషయానికి వస్తే సార్క్ ప్రాంత విమానాలపై రూ.వెయ్యి - రూ.3వేల వరకు, ఆఫ్రికా సర్వీసులకురూ.6వేల వరకు.. ఐరోపాసర్వీసులపై రూ.10వేల వరకు భారం పడనుంది. ఉత్తర.. తూర్పు ఆసియా ప్రాంతాలకు రూ.5500 వరకు పెరిగిన టికెట్ భారం ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఇండిగో సంస్థ ప్రతి ఏడాది సగటున 12 కోట్ల మందికి పైనే ప్రయాణికులను రవాణా చేస్తోంది. ప్రతి ప్రయాణికుడిపై కనీస ఛార్జీల పెంపును సరాసరిన రూ.200 వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేసినా.. రూ.2వేల కోట్లకు పైనే ప్రయాణికుల మీద భారం పడుతుంది. పెంచిన ధరలను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తే.. ఈ భారం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.
