ఇండిగో డిజాస్టర్.. ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ లో గోల గోల..
దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్స్ సంస్థగా పేరు సొంతం చేసుకున్న ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపం కారణంగా ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.
By: Madhu Reddy | 5 Dec 2025 4:15 PM ISTదేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్స్ సంస్థగా పేరు సొంతం చేసుకున్న ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపం కారణంగా ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. మూడు రోజులైనా కూడా పరిస్థితి చక్కబడడం లేదు. ప్రధాన విమానాశ్రయాలలో నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550 విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈరోజు ఢిల్లీ విమానాశ్రయంలో మరో 235 విమానాలను ఎయిర్లైన్ రద్దు చేసింది. చెన్నై,ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దేశంలోని అతి పెద్ద విమానాయాన సంస్థ అయినటువంటి ఇండిగో శీతాకాలపు షెడ్యూల్ ఒత్తిళ్లతో పాటు పైలేట్ ల కొరత కారణంగా ఈ గందరగోళం ఏర్పడిందని పేర్కొంది.
కార్యకలాపాలను కొనసాగించడానికి కొత్త విమాన విధి, సమయ పరిమితులు, నిబంధనలను పాక్షికంగా సవరించాలని ఎయిర్ లైన్ అభ్యర్థించింది. అంతేకాదు ఇలాంటి పరిస్థితి ఫిబ్రవరి 2026 నాటి వరకు కొనసాగుతుందని.. అప్పటివరకు ప్రయాణికులు సంయమనం పాటించాలని కూడా ఇండిగో అధినేతలు కోరారు.
ఇకపోతే మరోవైపు.. ఈరోజు కూడా మరో 400 ఫ్లైట్స్ రద్దు కావడంతో దేశం మొత్తం మీద ఉన్న విమానాశ్రయాలలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలు సరైన సమయంలో షూటింగ్ లకు వెళ్ళలేకపోవడంతో దాదాపు చాలా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీనికి తోడు బిజినెస్ పనులు కూడా ఆగిపోయాయి.. ఇక అలా చాలావరకు ఎన్నో పనులు స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో చాలా విమానాశ్రయాలలో ప్రయాణికులు గందరగోళం సృష్టిస్తున్నారు. సకాలంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడంలో ఇండిగో ఫెయిల్ అయిందని ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో బయలుదేరే విమానాలతో పాటు.. రాకపోకలతో సహా మొత్తం 235 ఇండిగో విమానాలు శనివారం ఉదయం 12 గంటల వరకు రద్దు చేయబడ్డాయి. ముంబై విమానాశ్రయంలో 104 ఇండిగో విమానాలలో 53 వెళ్ళేవి మరియు 51 వచ్చే విమానాలు ఉదయం నుండి రద్దు చేయబడినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. బెంగళూరులో 102 విమానాలు ( 52 వచ్చేవి మరియు 50 వెళ్లాల్సినవి) రద్దు చేసినట్టు నివేదించగా.. హైదరాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం నాటికి 132 విమానాలను (61 వచ్చేవి మరియు 71 బయలుదేరే విమానాలు) రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ వెల్లడించింది.
పూణేలో ఈరోజు ఉదయం 12 గంటల నుండి 8 గంటల మధ్య 32 ఇండిగో విమానాలు రద్దు చేయబడినట్లు విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు.అలాగే నాగ్ పూర్ నుండి వచ్చిన ఒక విమానాన్ని హైదరాబాద్ కు మళ్లించారు. కోలకత్తా ఎయిర్పోర్ట్లో బుధవారం నుండీ శుక్రవారం వరకూ ఇండిగో గందరగోళ కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొంది.
మొత్తం 468 షెడ్యూల్ చేసిన విమానాల్లో 320 విమానాలు ఆలస్యం అయ్యాయి. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానాలు 86 విమానాలను (50 బయలుదేరే విమానాలు, 36 వచ్చే విమానాలను) రద్దు చేసింది. శుక్రవారం రోజు ఇండిగో సంక్షోభం శ్రీనగర్ మరియు జమ్మూ విమానాశ్రయాలకు కూడా చేరుకుంది. అక్కడ కూడా 17 విమానాలు రద్దు చేయబడ్డాయి. పైగా అనేక ఇతర విమానాలు ఆలస్యమయ్యాయి. శ్రీనగర్లో 10 విమానాలు రద్దు చేయబడ్డాయి. జమ్మూలో ఏడు విమానాలు రద్దు చేయబడ్డాయి. దీనివలన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. జైపూర్ లో 11 ఆలస్యంగా వచ్చిన విమానాలు ఏడు ఆలస్యంగా బయలుదేరిన విమానాలు ఉండగా..18 రాకపోకల విమానాలు, 16 బయలుదేరాల్సిన విమానాలు రద్దు చేయబడ్డాయి.
విమానాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఇబ్బంది పడుతుండగా.. విమానాశ్రయ అధికారులు లభ్యత ఆధారంగా ఇతర విమానాల్లో ప్రయాణికులను ఉంచడానికి కృషి చేస్తున్నారని విమానాశ్రయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇంకోవైపు విశాఖ నుండి వెళ్లే 8 విమానాలు రద్దు అయ్యాయి. విజయవాడ వెళ్లేందుకు శంషాబాద్ లో ఇండిగో విమానం కోసం మంత్రి పార్థసారథి వేచి చూడగా.. అక్కడ అయ్యప్ప భక్తుల ప్రయాణించే విమానం ఆలస్యం పై ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక వారి ఆందోళనలను గమనించిన పార్థసారథి కేంద్రమంత్రి రామ్మోహన్తో స్వయంగా మాట్లాడి శబరిమలకు విమాన సర్వీసును ఏర్పాటు చేయించారు. విజయవాడకు వెళ్లాల్సిన ఆయన ఫ్లైట్ రద్దు కావడంతో రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఇక తమకోసం ప్రయాణ సదుపాయం కల్పించిన మంత్రికి అయ్యప్ప భక్తులు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో కూడా మొత్తం 92 విమానాలను రద్దు చేశారు. అందులో 43 శంషాబాద్ కి రావలసినవి, 49 శంషాబాద్ నుండి వెళ్లే విమానాలు ఉన్నాయి.అయితే ఇండిగో విమానాల రద్దు కారణంగా చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఎయిర్ లైన్స్ సిబ్బంది తమని పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తినడానికి తిండి,తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని,పడుకోడానికి ప్లేస్ లేక నేలపై చాలామంది పడుకుంటున్నామని,మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లో ఇండిగో షేర్లు కూడా పతనమయ్యాయి.
