మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..
భారతీయులకు మలేషియా కల్పిస్తున్న వీసా రహిత ప్రయాణ సదుపాయం 2026 డిసెంబర్ 31తో ముగియనుందని కథనాలు చెబుతున్నాయి. 2027 జనవరి 1 నుంచి మలేషియా వెళ్లాలంటే ముందస్తు వీసా తప్పనిసరి కానుందని సమాచారం. పర్యాటక వీసాపై వెళ్లి ఉద్యోగాలు వెతుకుతున్న వారి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2026 డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్ వీసా దరఖాస్తులు ప్రారంభం కానున్నట్లు కథనం పేర్కొంది.
By: A.N.Kumar | 20 Nov 2026 2:40 AM ISTపాస్పోర్టు చేతిలో పెట్టుకుని.. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి.. పదండి మలేషియా చెక్కేద్దాం అంటూ బ్యాగులు సర్దుకునే భారతీయ పర్యాటకులకు మలేషియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఎలాంటి వీసా తలనొప్పులు లేకుండా 30 రోజుల పాటు మలేషియా వీధుల్లో దర్జాగా తిరిగేసిన మనోళ్లకు ఇకపై ఆ లగ్జరీ ఉండబోదు. 2026 డిసెంబర్ 31 అర్ధరాత్రితో ఆ వీసా ఫ్రీ పండగకు శుభం కార్డు పడనుంది. 2027 జనవరి 1 నుంచి మలేషియా గడ్డపై అడుగుపెట్టాలంటే చేతిలో ముందస్తు వీసా ఉండాల్సిందే..
అసలు మలేషియా ఇంత సడన్గా మనపై ఎందుకు కన్నెర్రజేసింది? అని ఆరా తీస్తే.. మనోళ్ల మల్టీ-టాలెంట్ బయటపడింది. పాస్పోర్టు మీద పర్యాటకం అని ముద్ర వేయించుకుని.. విమానం దిగగానే రెజ్యూమ్లు పట్టుకుని ఉద్యోగాల వేటలో పడటం కొందరికి అలవాటుగా మారిందట. కౌలాలంపూర్ అందాలు చూస్తామని వెళ్లి అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్న టూరిస్ట్ కమ్ జాబ్ సీకర్స్ వ్యవహారం మలేషియా అధికారులకు చుక్కలు చూపించింది. ఏజెంట్ల మాయమాటలు నమ్మి వర్క్ పర్మిట్ లేకుండానే పనిలో చేరిపోతున్న మనోళ్లపై గతంలోనే భారత హైకమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. కానీ మేం వినం అన్నట్లుగా కొందరు వ్యవహరించడంతో చివరికి మలేషియా ప్రభుత్వం వీసా నిబంధనను మళ్లీ తెరపైకి తెచ్చింది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. మలేషియా ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ లో తేడా.. 2025 ఏప్రిల్లోనే చైనా పౌరులకు వీసా మినహాయింపును ఏకంగా మరో ఐదేళ్ల పాటు పొడిగించి రెడ్ కార్పెట్ పరిచింది. కానీ భారతీయుల విషయానికి వచ్చేసరికి మాత్రం 2026 డిసెంబర్తోనే బ్రేక్ వేసేసింది. పొరుగు దేశానికి ఒక న్యాయం.. మనకు ఒక న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.
2027 జనవరి నుంచి మలేషియా వెళ్లాలనుకునే వారు డిసెంబర్ 1, 2026 నుంచే ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నంత ఈజీగా మలేషియా టూర్ ఉండదు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
కొందరు చేసిన ఉద్యోగ విన్యాసాల పుణ్యమా అని.. నిజంగా హాలిడే ఎంజాయ్ చేయాలనుకునే సాధారణ పర్యాటకులకు కూడా ఇప్పుడు వీసా కష్టాలు తప్పడం లేదు. మలేషియా గేట్లు పూర్తిగా మూసుకుపోలేదు కానీ.. 2027 నుంచి ఆ గేటు దాటాలంటే ‘ వీసా అనే తాళం చెవిని ముందే జేబులో పెట్టుకోవాల్సిందే..
