Begin typing your search above and press return to search.

ట్రైన్ జర్నీలో వీడియోలు చూసే అలవాటుందా? మిస్ కావొద్దు

తాజాగా వచ్చిన కొత్త నిబంధనే దీనికి కారణం. పక్క వారి గురించి అస్సలు పట్టించుకోని ప్రయాణికులకు ముకుతాడు వేసేలా.. నిబంధనలు రావటమే దీనికి కారణం.

By:  Garuda Media   |   20 Oct 2026 11:28 AM IST
ట్రైన్ జర్నీలో వీడియోలు చూసే అలవాటుందా? మిస్ కావొద్దు
X

రైలు ప్రయాణం చేసే వారికి కొన్ని ఇబ్బందులు తరచూ ఎదురవుతుంటాయి. అందునా స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత కొందరు రైలు ప్రయాణంలో తాము చూసే వీడియోలను పెద్ద సౌండ్ తో వీక్షిస్తుంటారు. అలాంటోళ్లు.. తమ తోటి ప్రయాణికుల ఇబ్బందుల్ని అస్సలు పట్టించుకోరు. తమ కారణంగా వారికి ఇబ్బందిగా ఉంటుందన్న విషయాన్ని వారు లైట్ తీసుకుంటారు. పగటిపూట జర్నీలో కాస్త ఫర్లేదు. ఏదో రకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ.. రాత్రి వేళ ఇదే తరహాలో చేసే వారి కారణంగా ఎదురయ్యే ఇబ్బంది అంతా ఇంతా కాదు.

ఇప్పటివరకు ఇలా జరిగినా.. ఇకపై అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే.. తాజాగా వచ్చిన కొత్త నిబంధనే దీనికి కారణం. పక్క వారి గురించి అస్సలు పట్టించుకోని ప్రయాణికులకు ముకుతాడు వేసేలా.. నిబంధనలు రావటమే దీనికి కారణం. అవును.. రైలు ప్రయాణం చేసే వేళలో.. ఫోన్ స్పీకర్ ను వాడటం.. భారీ శబ్దంతో వీడియోలను చూడటం.. ఆడియోలను వినటం చేస్తే ఫైన్ పడే ప్రమాదం ఉంది. అంతేకాదు.. శ్రుతిమించినట్లుగా వ్యవహరించేవారికి జైలుశిక్షకు సైతం అవకాశం ఉంది.

అవును.. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు వీలుగా దక్షిణ రైల్వే నిర్ణయం తీసుకుంది.తాజాగా తీసుకొచ్చిన నిబంధనను ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు తొలుత చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఈ నెల ఆరో తేదీన ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవల సదరన్ రైల్వే అయితే.. ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ కొత్త రూల్ గురించి అన్ని డివిజన్లలోని ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.వెయ్యి వరకు ఫైన్ కానీ జైలుశిక్ష కానీ.. కొన్ని కేసుల్లో రెండింటిని విధించేందుకు వీలుగా నిబంధనల్ని రూపొందించారు. తాజాగా ఉత్తర.. పశ్చిమ రైల్వే జోన్లలోనూ ఇదే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే ఈతరహా నిబంధనకు సంబంధించి దాదాపు పుష్కరం క్రితమే రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చింది లేదు. అయితే.. తాజాగా మాత్రం ఈ అంశంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేలా స్టిక్కర్లు ఏర్పాటు చేయటం.. అవగాహన కల్పించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రైల్వే జోన్లు ఈ అంశంపై ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నిబంధనను కఠినంగా అమలయ్యేలా చేస్తే.. రైలు ప్రయాణం మరింత సుఖవంతం కావటమే కాదు.. ప్రశాంతంగా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు.