Begin typing your search above and press return to search.

భారత పాస్‌పోర్ట్ కి 75వ స్థానం.. ఈ ర్యాంకింగ్ తో ఎన్ని దేశాలు తిరగచ్చో తెలుసా?

సాధారణంగా ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలి అంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి అయిపోయింది.

By:  Madhu Reddy   |   14 Feb 2026 12:00 AM IST
భారత పాస్‌పోర్ట్ కి 75వ స్థానం.. ఈ ర్యాంకింగ్ తో ఎన్ని దేశాలు తిరగచ్చో తెలుసా?
X

సాధారణంగా ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలి అంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ పాస్‌పోర్ట్ విషయంలో కూడా జాప్యం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్ని అనుమతులు పూర్తయి పాస్‌పోర్ట్ రావడానికి ఎంత సమయం పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి సమయంలోనే ఒక దేశ పాస్‌పోర్ట్ పొందిన తర్వాత మిగతా దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా మారిపోయింది.. అసలు వీసా లేకుండా ఏదైనా దేశానికి వెళ్లే అవకాశం లభిస్తే ఎంత బాగుండో అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. అలాంటి వారి కోసమే "హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్"ఎప్పటికప్పుడు జాబితాను విడుదల చేస్తూ ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ ను అందిస్తోంది.

భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ ఎంతంటే?

ఈ క్రమంలోనే ప్రపంచంలో ఏ దేశం యొక్క పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతమైనదో తెలిపే "హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026" రిపోర్ట్ తాజాగా విడుదలైంది. ఇందులో భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకు ఏకంగా 75 కు చేరుకుంది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 75వ స్థానానికి చేరుకోవడంతో అటు ప్రయాణికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకే ఏడాదిలో సుమారుగా 10 స్థానాలు ఎగబాకింది. ఇకపోతే భారత్ పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే వెళ్లవచ్చు. లేదా అక్కడికి వెళ్లిన తర్వాత అయినా వీసా తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు.

17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే ర్యాంక్..

ఇకపోతే భారత పాస్‌పోర్ట్ విలువ దాదాపు 17 ఏళ్ల క్రితం అంటే 2008 - 2009 సంవత్సరం మధ్యకాలంలో ఇదే ర్యాంకులో ఉండేది. అయితే ఆ తర్వాత కాలక్రమేనా భారత్ పాస్‌పోర్ట్ పవర్ కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఆ స్థాయికి చేరుకోవడం ప్రశంసనీయమని చెప్పవచ్చు. ఏది ఏమైనా భారత పాస్‌పోర్ట్ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జాబితాలో 75వ స్థానానికి చేరుకొని అందరిని సంతోషపరిచింది.

ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితా..

ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ లిస్టులో ఉన్న దేశాల విషయానికి వస్తే.. ముఖ్యంగా ఆసియా దేశాలే ఇందులో హవా కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. అందులో సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా.. జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాయి. ఈ దేశాల పౌరులు ఒక్కసారి వీసా తీసుకుంటే సుమారుగా 185 కంటే ఎక్కువ దేశాలకు వీసా లేకుండానే వెళ్లే అనుమతి లభిస్తుంది. ఒకప్పుడు టాప్ లో ఉన్న అమెరికా ప్రస్తుతం పదవ స్థానానికి పడిపోవడం విచారకరం.

ఇకపోతే ఏంటీ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అంటే?

ప్రతి ఒక్కరికి సందేహం కలగవచ్చు... ఈ ర్యాంకింగ్ ను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఎలా గుర్తిస్తుంది? అసలు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అంటే ఏంటి ? అనే విషయానికి వస్తే.. ఏ దేశ పాస్‌పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు లెక్కించి ఈ ర్యాంకులను ఇస్తారట. దీనికోసం అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ (IATA) ఇచ్చే అధికారిక సమాచారాన్ని తీసుకుంటారు.