సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. స్మార్ట్‌ఫోన్ బోర్డింగ్ పాస్ చాలు!
ఇన్నాళ్లూ విదేశాలకు వెళ్లేటప్పుడు ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్‌పై ఫిజికల్ స్టాంపింగ్ వేయించుకోవడం విధిగా ఉండేది.
By: Madhu Reddy | 22 Aug 2026 8:00 PM ISTవిదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో బోర్డింగ్ పాస్‌లపై ఫిజికల్‌గా ఎలాంటి స్టాంపింగ్ వేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇమిగ్రేషన్ బ్యూరో ప్రకటించింది. కేవలం మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఈ-బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోతుంది. ప్రయాణాలను మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు చూద్దాం..
స్టాంపింగ్ బాధలకు స్వస్తి:
ఇన్నాళ్లూ విదేశాలకు వెళ్లేటప్పుడు ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్‌పై ఫిజికల్ స్టాంపింగ్ వేయించుకోవడం విధిగా ఉండేది. అయితే కొన్నిసార్లు ఈ స్టాంపింగ్ సరిగ్గా పడకపోవడం లేదా అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అంతేకాకుండా క్యూ లైన్లలో ఎక్కువ సమయం నిలబడాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ఇమిగ్రేషన్ విభాగం స్టాంపింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది.
స్మార్ట్‌ఫోన్‌లో ఈ-బోర్డింగ్ పాస్ ఉంటే చాలు:
కొత్త రూల్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి ప్రయాణికులు తమ ఫోన్లలోని ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపిస్తే ఇమిగ్రేషన్ అధికారులు క్లియరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా పేపర్ బోర్డింగ్ పాస్ తీసుకొచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటిని అధికారులు స్వీకరిస్తారు కానీ, వాటిపై మాత్రం ఎలాంటి స్టాంపులు వేయరు. ఇక ఇప్పటికే సీఐఎస్ఎఫ్ (CISF) సెక్యూరిటీ తనిఖీల వద్ద స్టాంపింగ్ రద్దు కాగా, ఇప్పుడు ఇమిగ్రేషన్‌లో కూడా రద్దు చేయడం విశేషం.
పాస్‌పోర్ట్‌లపై కూడా స్టాంపింగ్ రద్దు?:
భారత పౌరుల ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుపై పనిచేస్తోంది. త్వరలోనే అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయ పౌరుల పాస్‌పోర్ట్‌లపై ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపింగ్ కూడా వేసే విధానాన్ని శాశ్వతంగా ఎత్తివేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి పూర్తికాగానే అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
సాంకేతికత పెరుగుతున్న వేళ ఎయిర్‌పోర్టుల్లో డిజిటల్ విధానాన్ని విస్తరించడం వల్ల ప్రయాణికులకు సమయం గణనీయంగా ఆదా అవుతుంది. ఇకపై ఎయిర్‌పోర్ట్ క్యూలలో గంటల తరబడి నిలబడే పనిలేకుండా, ఫోన్ చూపిస్తూ హ్యాపీగా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ పూర్తి చేసుకుని విదేశాలకు ఎగిరిపోవచ్చు.
