పాకిస్థాన్ గాలి తీసిన సూర్య
అది చాలదన్నట్లు మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ప్రత్యర్థి జట్టుకు మామూలు పంచ్ ఇవ్వలేదు.
By: Garuda Media | 22 Sept 2025 10:28 PM ISTఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఒకప్పుడు ఉన్న ఆసక్తే వేరు. కానీ పాక్ తెర వెనుక ఉండి చేయించిన పహల్గాం ఉగ్రదాడి.. దానికి బదులుగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని.. అసలు ఆ దేశంతో క్రికెట్ సహా ఏ సంబంధాలు వద్దనే డిమాండ్ మెజారిటీ జనాల నుంచి వచ్చింది.
అయినా సరే.. ఆసియా కప్‌లో ఆ జట్టుతో మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్‌తో ఎలాగూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడట్లేదు. ఇలా మల్టీ నేషన్స్ టోర్నీల్లో ఆ జట్టుతో ఆడేందుకు నో చెబితే.. ఐసీసీ టోర్నీల ఆతిథ్య హక్కులు కోల్పోతామన్న కారణంతో బీసీసీఐ ముందుకు వెళ్తోందని భావిస్తున్నారు. ఇక ఆసియా కప్‌లో పాకిస్థాన్‌కు టీమ్ ఇండియా మామూలు ఝలక్‌లు ఇవ్వట్లేదు. గ్రూప్ దశ మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తుగా ఓడించడమే కాదు.. ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనాలకు కూడా నో చెప్పడం వారికి అవమాన భారాన్ని మిగిల్చింది. దీని మీద పాక్ ఎంత గొడవ చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఇక సూపర్-4 దశలో భాగంగా ఈ ఆదివారం మళ్లీ పాక్‌తో తలపడింది భారత్. తొలి మ్యాచ్‌తో పోలిస్తే విజయం కోసం భారత్ కొంత కష్టపడింది. పాక్ ఈసారి మెరుగ్గా ఆడింది. అయినా విజయం మాత్రం మనదే. పాక్ ఓపెనర్ ఫర్హాన్ అర్ధసెంచరీ తర్వాత గన్నుతో కాలుస్తున్నట్లు పోజు పెట్టడం.. ఆ జట్టు పేసర్ రవూఫ్ 6-0 సింబల్ చూపించి తామేదో ఇండియాకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేసినట్లు బిల్డప్ ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐతే అంతిమంగా ఇండియానే గెలవడంతో పాక్ ఆటగాళ్లకు మరోసారి అవమానం తప్పలేదు.
అది చాలదన్నట్లు మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ప్రత్యర్థి జట్టుకు మామూలు పంచ్ ఇవ్వలేదు. విలేకరులు ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ రైవల్రీ గురించి మాట్లాడుతుంటే.. అసలు మీరేం ,రైవల్రీ గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్టేదని అతనన్నాడు.
రెండు జట్లు 15 మ్యాచ్‌లు ఆడితే అందులో గెలుపోటములు 7-8తో ఉంటే దాన్ని రైవల్రీ అంటారని.. కానీ 15-0, 14-1.. ఇలా ఉంటే అందులో రైవల్రీ ఏం ఉందని అతనన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా పాకిస్థాన్‌పై భారత్ ఒక్కసారీ ఓడిపోలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. చివరి 15 టీ20ల్లో భారత్ 11 గెలిస్తే.. పాక్ మూడే నెగ్గింది. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకునే పాక్ తమకు పోటీయే కాదంటూ ఆ జట్టు గాలి తీశాడు సూర్య.
