మూడు రోజులు ఏపీలోనే మోడీ!
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతిలో పర్యటించనున్నారు. ఏర్పేడులోని ఐసర్‌లో జరిగే 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొంటారు. అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు 200 మందికి పైగా ఐపీఎస్ అధికారులు హాజరుకానున్నారు. డిసెంబర్ 6న తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
By: Satya P | 29 Nov 2026 9:13 PM ISTదేశ ప్రధాని ఒక రాష్ట్రంలో మూడు రోజుల పాటు విడిది చేయడం అన్నది అరుదైన సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత రాష్ట్రాలు ఉన్న అతి పెద్ద భారత దేశాన్ని ఏలే ప్రధాని ఎంతో బిజీగా ఉంటారు. ఆయన ప్రతీ నిముషం కూడా ఎంతో విలువైనదిగా ఉంటుంది. అలాంటిది ప్రధాని ఒక రాష్ట్రంలోనే మూడు రోజులు ఉంటున్నారు అంటే ఆ పర్యటన ఎంత విలువైనది అన్నది ఇక్కడ చూడాలి. అవును ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజులు విడిది చేసే కార్యక్రమం అతి ముఖ్యమైనది. ఏపీలోనే నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఆయన తిరుపతి పర్యటన ఈ మేరకు ఖరారు అయింది.
షెడ్యూల్ ప్రకారం చూస్తే :
ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి పర్యటన షెడ్యూల్ చూస్తే కనుక ఆయన డిసెంబర్ నెలలో 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరగనున్న 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొననున్నారు. ఈ అత్యున్నత స్థాయి సదస్సు తిరుపతి జిల్లాలోని ఏర్పేడులోని ఐసర్‌లో ఈ సదస్సు జరగనుంది. ఇక ప్రతీ రోజూ ఉదయం 11 గంటలకు మొదలయ్యే సదస్సు రాత్రి 8.30 గంటల వరకూ సాగుతుంది. ఇలా మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మోడీ హాజరవుతున్నారు. ఆయన డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ మీదట మోడీ 4, 5, 6 తేదీలలో తిరుపతిలోనే బస చేస్తారు.
కట్టుదిట్టమైన భద్రత :
ఇక నరేంద్ర మోడీ ఈ నెల 5వ తేదీన ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 9 వరకు పోలీసు సదస్సులో పాల్గొంటారు. అలాగే 6వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల వరకూ ఆయన ఈ సదస్సు కార్యక్రమలలో భాగంగా అక్కడే జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీవారిని నరేంద్ర మోడీ దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉటే ప్రధాని తిరుపతి పర్యటనతో పాటు ఏకంగా మూడు రోజుల పాటు ఆయన బస చేయడం తో స్థానికంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా రవాణా, వసతి, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.
అమిత్ షా సహా ప్రముఖులు :
ఇక ఈ ఉన్నత స్థాయి సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ఎన్ఎస్ఏ అజిత్ ఢోబాల్ హాజరు కానున్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా సుమారు రెండు వందల మందికి పైగా ఐపీఎస్ అధికారులు దీనిలో పాల్గొననున్నారని అంటున్నారు. ఈ కీలక సదస్సులో దేశ అంతర్గత భద్రత తో పాటు, వర్తమాన పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపైన కూడా చర్చిస్తారు అని అంటున్నారు. అలగే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం అండతో పెరుగుతున సైబర్ నేరాలు, డ్రగ్స్, అక్రమ రవాణాపైన కూడా ఈ సదస్సులో ప్రత్యేక చర్చ చేపట్టనున్నారని తెలుస్తోంది. ఇక ఉగ్రవాద ముప్పు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణపైన కూడా సమీక్షించనున్నారు. ఇక పోలీసు వ్యవస్థలో ఏఐ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపైన కీలక చర్చ సాగనుంది. ఈ సదస్సు నేపధ్యంలో డిసెంబర్ 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటలకు యోగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొననున్నారని చెబుతున్నారు. .
