Begin typing your search above and press return to search.

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్లు సాధించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో 65 సీట్లు, 92 లక్షల ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో 25 సీట్లు అదనంగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

By:  A.N.Kumar   |   23 Nov 2026 10:07 AM IST
మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం
X

తెలంగాణ రాజకీయాల్లో ఇంకా 2023 ఎన్నికల వేడి పూర్తిగా చల్లారకముందే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 2028.. ఆ మాటకొస్తే 2034 ఎన్నికల క్యాలెండర్‌ను కూడా చేతిలోకి తీసేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వింటుంటే రాజకీయ విశ్లేషకులకు సైతం ఒక క్షణం మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ 90 సీట్లు.. కోటి ఓట్లు సాధించడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు.. దాదాపు 92 లక్షల ఓట్లతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలికిన ఉత్సాహంలో ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా మరో 25 సీట్లు అదనంగా గెలవాలని టార్గెట్ పెట్టారు. రాజకీయాల్లో ఆశ ఉండటం తప్పులేదు కానీ.. అది మరీ ఆకాశంలో మేడలు కట్టినట్లు ఉండకూడదని ప్రతిపక్షాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న 65 సీట్లను కాపాడుకోవడానికే నానా తంటాలు పడుతుంటే.. 90 సీట్ల లెక్కలు వేయడం చూస్తుంటే అసలు గ్రౌండ్ రియాలిటీ తెలిసే మాట్లాడుతున్నారా? అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి ఆలోచనలు కేవలం 2028తో ఆగిపోలేదు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే వరుసగా మరో రెండు టర్మ్‌లు అధికారం మనదే అన్నమాట.. ఈ లెక్కన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఇక దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్లిపోవడమే మేలేమో అన్నట్లుగా ఆయన మాటల ధోరణి ఉంది.

లక్ష్యాలు భారీగా పెట్టుకోవడం బాగానే ఉంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు సహకరించాలి కదా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు.. రైతుల సమస్యలు.. నిరుద్యోగ యువత ఆశలు.. ఇలా ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలక్ష పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మరోవైపు గత ఓటమి నుంచి తేరుకుంటున్న బీఆర్ఎస్.. రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఊరికే కూర్చుంటాయా?

2028 ఎన్నికలకు ఇంకా బోలెడంత సమయం ఉన్నా.. రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి నుంచే కోటి ఓట్లు - 90 సీట్లు అంటూ భారీ స్కెచ్ వేశారు. 92 లక్షల ఓట్లు కోటి మార్కును దాటుతాయో లేదో తెలియదు కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో.. రాజకీయ వర్గాల్లో మంచి చర్చకు.. అంతకుమించి సెటైర్లకు వేదికయ్యాయి. ఈ కలల సౌధం నిజమవుతుందో లేక కేవలం రాజకీయ వ్యూహంగానే మిగిలిపోతుందో చూడాలి.