బీజేపీకి అంత సీన్ లేదు...కమలం గుండెల్లో రేవంత్ గునపాలు !
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, స్థానిక ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఎన్ని అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ను ఓడించలేవని ధీమా వ్యక్తం చేశారు.
By: Satya P | 27 Nov 2026 7:55 AM ISTతెలంగాణా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అన్నది తెలిసిందే. ఆయన మంచి స్పీకర్. అనర్గళంగా మాట్లాడగలరు, సభలో వేలాది మందిని తమ మాటలతో మెప్పించగలరు, ఒప్పించగలరు. కేసీఆర్ కి ఆ టాలెంట్ ఉంది. ఆయన తరువాత మళ్లీ రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తారు. జనాలను మాటలతో మెస్మరైజ్ చేయడంతో ఈ ఇద్దరూ దిట్టలే. ప్రస్తుతం రేవంత్ హవా సాగుతోంది. ఆయన గత మూడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ వంటి మహా సముద్రంలో కుదురుకుని గట్టి పట్టు సాధించారు. ఆయన రచ్చ గెలిచే ప్రయత్నంలో కూడా ఒకసారి సక్సెస్ అయ్యారు. 2028లో మరోసారి గెలిచి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ మీద ఒక రేంజిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆయన చేసిన విమర్శలు కమలం పార్టీ గుండెలో గునపాలనే దింపాయి అంటున్నారు.
డైరెక్ట్ ప్రశ్నగానే :
అసలు తెలంగాణాలో బీజేపీ ఎక్కడ ఉంది అని స్ట్రైట్ గానే రేవంత్ రెడ్డి బీజేపీని ప్రశ్నించారు. మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఎన్ని అని నిలదీశారు. ఎన్ని పంచాయతీలు గెలిచారు, ఎన్ని వార్డులు గెలిచారు, మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి అని రేవంత్ రెడ్డి తెలంగాణా బీజేపీ మూలాల్లోనే కుదిపేశారు. ఏ వూరిలో బీజేపీ ఉంది. అసలు బీజేపీ ఎక్కడ ఉందో చెప్పమని కూడా ప్రశ్నించారు. అలాంటి బీజేపీ తాము కూడా అధికారంలోకి వస్తామని చెప్పడం కంటే విడ్డూరం వేరేది ఉందా అని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
కలిసి రండి అంటూ :
అంతే కాదు బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలసి వచ్చినా కాంగ్రెస్ దే విజయం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. తమకు ఆ బలం ఉందని ఆయన గట్టిగానే చెప్పుకున్నారు. బీఆర్ఎస్ ఓటమి చెందింతే కేసీఆర్ ఫాం హౌస్ కి పరిమితం అయ్యారని ఇక బీజేపీ అయితే తెలంగాణ లో ఎక్కడా లేదని ఆయన వెటకరించారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓడిస్తామని కూడా ధీమా వ్యక్తం చేయడం విశేషం. బీజేపీని అంత సీన్ లేదని ఒక్క లెక్కన రేవంత్ రెడ్డి తేల్చేశాక ఇక కమలం పార్టీ దీనికి ఏ విధంగా బదులు ఇస్తుంది అన్నదే చూడాల్సి ఉంది.
వర్కౌట్ అయ్యేనా :
బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తామని అంటోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ప్రత్యర్థిగా ఆయన విమర్శించడం సహజం అని అనుకున్నా బీజేపీకి గ్రౌండ్ లెవెల్ లో ఉన్న బలం ఎంత అన్నది కూడా మరోసారి విశ్లేషించు కోవాల్సిన అవసరాన్ని ఆయన తన విమర్శల ద్వారా కల్పించారు అని అంటున్నారు. బీజేపీ నిజమైన బలం ఏమిటో ఆయన చెప్పారు, అది సెటైరికల్ గా అయినా ప్రత్యర్ధి చెప్పినపుడు బీజేపీ పెద్దలు జాగ్రత్తగా వింటే తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సొంత పార్టీ వారు వాపుని చూసి బలం అనుకుంటారు, తాము ఎక్కడా తగ్గలేదని తామే గెలుస్తామని కూడా అంటూంటారు మరి దీనినే విజయానికి దగ్గర దారి అనుకుని మురిసిపోతే మాత్రం కమలం ఖంగు తినడం ఖాయమని అంటున్నారు. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలలో సహేతుకతను నిర్మాణాత్మకమైన పంధాలో బీజేపీ తీసుకుంటే ఈ రోజు నుంచి బలం పెంచుకునే మార్గాన్ని అన్వేషించవచ్చు అని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి బీజేపీ గట్టిగానే బరిలోకి దిగాలని గ్రౌండ్ వర్క్ చేయాలన్నదే ఈ విమర్శల అసలైన సారాంశంగా ఉంది మరి.
