దుర్మార్గుడు... కేటీఆర్: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత చెల్లికే ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. రాఖీ పండుగ రోజు చెల్లి రాఖీ కట్టేందుకు వచ్చినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు. కొడంగల్ పర్యటనలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మహిళా సంఘాలతో సమావేశమయ్యారు.
By: Garuda Media | 8 Nov 2026 4:44 PM ISTతెలంగాణలో రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీ ఆర్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ కేటీఆర్ ను అదేవిధంగా బీఆర్ ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సంచ లన వ్యాఖ్యలు చేశారు. ``కేటీఆర్ దుర్మార్గుడు.. పరమ దుర్మార్గుడు`` అంటూ బిగ్గర స్వరంతో వ్యాఖ్యానించారు.
''సొంత చెల్లిని ఇంటినుంచి గెంటేసిన దుర్మార్గుడు కేటీఆర్'' అని రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడితో కూడా ఆగ కుండా.. `ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందని.. ఇంటి నుంచి గెంటేశాడు`` అని దుయ్యబట్టారు. ఇలాంటి వారితో రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉంటుందా? మహిళల ఆస్తులకు భద్రత ఉంటుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించా రు. అంతేకాదు.. ``రాఖీ పండగ అంటే.. అక్కలకు చెల్లెమ్మలకు ఆత్మీయ పండగ. ఆ పండుగ రోజు సొంతచెల్లి రాఖీ కట్టేందుకు వస్తే.. కనీసం పట్టించుకోకుండా అమెరికాకు పారిపోయిన దుర్మార్గుడు కేటీఆర్`` అని అన్నారు.
ఇక, కేసీఆర్ గురించి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజలు ఆయనను నమ్మి అధికారం అప్పగిస్తే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడని విమర్శించారు. కుటుంబానికి పదవులు ఇచ్చుకుని.. రాజభోగం వెలగబెట్టారని అన్నారు. ఏనాడైనా సామాన్యులను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. సీఎం అంటే.. మేడల్లో ఉండే వాడిగా చిత్రీకరించారని.. కానీ తాము అదికారం చేపట్టాక.. సామాన్యుల చెంతకు సీఎం అనేలా వ్యవహరిస్తున్నామన్నారు. మహిళా శక్తికి విలువ ఇస్తున్నామన్నారు. వారిని ఆర్థిక శక్తులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
కాగా. కొడంగల్‌లో రెండో రోజు హకీంపేట్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రూ.4 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలు, రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ. 81 కోట్లతో ఏర్పాటు కానున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అలాగే నాచారం నుంచి కొత్వాల్ గూడ వరకు రేడియల్ రోడ్-2 పనులకు శంకుస్థాపనలు చేశారు.
దీపావళి కానుకగా చేయూత పథకం కింద కొత్తగా మంజూరైన పింఛన్ పత్రాలను సీఎం రేవంత్ స్వయంగా లబ్ధిదారులకు అందించారు. అలాగే 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకల్లో భాగంగా శ్రీనివాస్-సుమిత్ర దంపతుల ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
