Begin typing your search above and press return to search.

కేసీఆర్ దీక్ష‌కు 17 ఏళ్లు.. కేటీఆర్ ఏమ‌న్నారంటే!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు నవంబర్ 29తో 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. “నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు” అని పేర్కొన్నారు. కేసీఆర్ సాహసంతోనే తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తింపు వచ్చిందని, మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని కొనియాడారు.

By:  Garuda Media   |   29 Nov 2026 9:19 PM IST
కేసీఆర్ దీక్ష‌కు 17 ఏళ్లు.. కేటీఆర్ ఏమ‌న్నారంటే!
X

తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా ప్ర‌స్తుత బీఆర్ ఎస్‌.. అప్ప‌టి టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ చేప‌ట్టిన దీక్ష‌కు ఆదివారం(న‌వంబ‌రు 29)నాటికి 17 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ప్ర‌త్యేక‌ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో చివ‌రి అంకంగా చేప‌ట్టిన ఈ దీక్ష‌.. అనేక మ‌లుపులు తిరిగిన విష‌యం తెలిసిందే. అనూహ్యంగా దీక్షను విరమిస్తూ.. కేసీఆర్ అప్ప‌ట్లో చేసిన ప్ర‌క‌ట‌న విద్యార్థుల‌ను ఆగ్ర‌హానికి కూడా గురి చేసింది. దీంతో దీక్ష‌ను విర‌మించ‌డం లేద‌ని ప్ర‌క‌టించి.. మ‌ళ్లీ కొన‌సాగించారు. మొత్తంగా.. ఆనాడు కేసీఆర్ చేసిన దీక్ష త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాల‌తో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించింది.

అప్ప‌ట్లో `తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో` అనే నినాదంతో కేసీఆర్ ఈ దీక్ష చేప‌ట్టారు. నిజానికి అప్ప‌టి వ‌ర కు చేసిన ఉద్య‌మాలు.. చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌కు దీటుగా ఈ దీక్ష సాగింద‌నే చెప్పాలి. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ దీక్ష ఒక ప్ర‌త్యేక‌త‌ను కూడా సంత‌రించుకుంది. అప్ప‌టి వ‌ర‌కు జాతీయ మీడియా లైట్ తీసుకున్నా.. కేసీఆర్ దీక్ష‌, దీనికి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఆద‌ర‌ణ వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. ప్ర‌ధాన క‌వ‌రేజీ ఇచ్చాయి. ఇక‌, జాతీయ‌స్థాయిలోనూ కేసీఆర్ చేప‌ట్టిన దీక్ష‌కు క‌ద‌లికి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. నాడు దీక్ష చేప‌ట్టిన కేసీఆర్‌ను బ‌ల‌వంతంగా పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించినప్ప‌టి ఫొటోను పోస్టు చేశారు. ``చావు నోట్లో త‌ల‌కాయ పెట్టి కూడా.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు కృషి చేశారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వా నికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చారు.`` అని కేసీఆర్‌ను కొనియాడారు. మూడున్న‌ర కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష ల‌ను, ఆశ‌ల‌ను నెర‌వేర్చార‌ని పేర్కొన్నారు.

నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు!

నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు.. అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. డిసెంబ‌రు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న‌ట్టుగా అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. అనంత‌రం.. ప‌లు ద‌ఫాల చ‌ర్చ‌లు, పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ పెట్ట‌డం, ఉమ్మ‌డి అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం.. జ‌రిగాయి. త‌ర్వాత‌.. జూన్ రెండున ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ఆనాడు కేసీఆర్ ఇంత సాహ‌సం చేయ‌క‌పోతే.. రాష్ట్రం వ‌చ్చేది కాద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.