ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ మాత్రం ఇప్పటికీ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందే జనంలోకి రావాలన్న కేసీఆర్ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుందన్న చర్చ సాగుతోంది.
By: Satya P | 24 Nov 2026 7:00 AM ISTవచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇదే మాట అంటున్నారు. హరీష్ రావు అదే ధీమాను ప్రదర్శిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరిగి మూడేళ్ళు అయింది. అచ్చంగా మరో రెండేళ్ల కాలం మాత్రమే అసెంబ్లీ ఎన్నికలకు ఉంది. ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఎక్కడా బయటకు వచ్చింది పెద్దగా లేదని అంటున్నారు. అంతే కాదు ఆయన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ సభకు కూడా రావడం లేదు. కేసీఆర్ కేరాఫ్ ఫాం హౌస్ అని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఇంతలో మూడేళ్ళు ఇట్టే తిరిగిపోయాయి.
జనంలోకి రేవంత్ :
ఇదిలా ఉంటే జనంలోనే నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటున్నారు. సీఎం గా ఆయనకు అధికారిక కార్యక్రమాలు ఎటూ ఉంటాయి. అయితే ఆయన అనేక జిల్లాలలో అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ జనాలకు కాంగ్రెస్ చేసిన మేలు చెబుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. అంతే కాదు వారసత్వ రాజకీయాలను ఎండగడుతున్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తిగా తప్పుపడుతున్నారు. తెలంగాణాకు అది గుదిబండగా మారింది అంటున్నారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అటు క్యాడర్ లోనూ ఇటు జనాల్లోనూ ధీమా పెరిగేలా చేస్తున్నారు. ఇక సంక్రాంతి తరువాత జిల్లాల టూర్లు రేవంత్ రెడ్డి పెట్టుకుంటున్నారు. అలా ఎన్నికలకు రెండేళ్ళ ముందే రాష్ట్రమంతా చుట్టేయాలని ఆయన భారీ ప్లాన్ తోనే ఉన్నారు. అదే సమయంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అయితే తన గ్రాఫ్ ని ఏ మేరకు పెంచుకుంది అన్నదే చర్చకు వస్తున్న విషయం.
జోడు గుర్రాలుగా :
ఇక కేసీఆర్ అయితే ఫాం హౌస్ లో ఉన్నారు కానీ కేటీఆర్ హరీష్ రావు జనంలోనే ఉంటూ పార్టీని పటిష్టం చేసే పనిని గట్టిగానే తీసుకున్నారు. అసెంబ్లీలో అయినా లేదా జనంలో అయినా లేదా పార్టీ ఆఫీసుల్లో అయినా ఈ ఇద్దరు నేతలు జోడు గుర్రాల మాదిరిగా ఉంటూ బీఆర్ఎస్ ని లేపడానికి చూస్తున్నారు. అయితే వారు ఎంత కష్టపడుతున్నా కూడా గులాబీ పార్టీ గ్రాఫ్ అనుకున్న స్థాయిలో పెరుగుతోందా అన్నదే చర్చగా ఉంది. రేవంత్ రెడ్డి దూకుడు ముందు అయితే బీఆర్ఎస్ జోడీ తేలిపోతోంది అన్నది కూడా విశ్లేషణగా ఉంది. కేసీఆర్ అవతల వైపు ఉంటేనే మజా ఉంటుందని అంటున్నారు.
గులాబీ బాస్ స్ట్రాటజీ :
ఇక చూస్తే కేసీఆర్ సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు జనంలోకి రావాలనుకుంటున్నారా అన్నది చర్చగా ఉంది. అపుడు వస్తే ఊపు వస్తుందని కూడా భావిస్తున్నారు అని అంటున్నారు. అప్పటికి ఎన్నికల మూడ్ వస్తుందని జనాలు చెప్పేది పూర్తిగా వింటారు అని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇవన్నీ ఓల్డ్ స్ట్రాటజీస్ అని మరో మాట వినిపిస్తోంది. గతంలోలా ఎన్నికల ముందు వస్తే జనాలు టర్న్ కావడం లేదని కూడా గుర్తు చేస్తున్నారు. కనీసం రెండేళ్ల ముందు అయినా జనంలోకి వస్తేనే ప్రజలు కూడా ఆలోచిస్తారని ఎన్నికల హడావుడిలో ఎంత చెప్పినా అది రాజకీయ చర్చగానే ఉంటుందని కూడా అంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటప్పట్లో వచ్చేది లేదనే అంటున్నారు. మరి చూడాలి బీఆర్ఎస్ కొత్త ఎత్తుగడలు ఏ విధంగా ఉండబోతున్నాయో.
