Begin typing your search above and press return to search.

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

నవంబర్ 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన సందర్భంగా భారీ సభ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ సభకు లక్ష మందిని సమీకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బూత్ స్థాయి నుంచి జనసమీకరణకు ప్రణాళికలు రూపొందించారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ బలాన్ని చాటే వేదికగా ఈ సభను బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

By:  A.N.Kumar   |   22 Nov 2026 5:06 PM IST
బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?
X

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి కరీంనగర్ గడ్డ సిద్ధమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనను కేవలం ఒక సాధారణ పార్టీ కార్యక్రమంగా కాకుండా రాష్ట్రంలో తమ రాజకీయ సత్తా చాటే వేదికగా మార్చుకోవాలని కాషాయ దళం భావిస్తోంది. ఈ సభకు ఏకంగా లక్ష మందిని సమీకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దేశించుకున్నారు. ఈ భారీ జనసమీకరణ వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

నవంబర్ 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న భారీ పాదయాత్ర.. బహిరంగ సభను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, మండలాల నుంచి సుమారు లక్ష మందిని సమీకరించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. కేవలం ముఖ్య నాయకులు.. కార్యకర్తలకే పరిమితం కాకుండా.. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జనసమీకరణ జరగాలని బండి సంజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నాయకులు, నగర మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఇతర కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరి బాధ్యతలను వారికి అప్పగించారు.

ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న 'లోక్‌తంత్ర బచావో.. అరాజకతా హటావో' కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరై విజయవంతమైనట్లు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష ఇండియా కూటమి చేస్తున్న విమర్శలకు దీటుగా బదులివ్వడం.. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడులంటూ బీజేపీ ఆరోపిస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆ సభ ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో కరీంనగర్‌లోనూ జనసమీకరణ జరిపితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి బలమైన కేడర్ ఉందనే సంకేతాన్ని పంపవచ్చని బండి సంజయ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

నవంబర్ 23న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న నితిన్ నబీన్.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. జాతీయ అధ్యక్షుడి రాక కంటే కూడా ఆయనకు లభించే స్వాగతం.. తరలివచ్చే జనసందోహం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు ప్రధానంగా బండి సంజయ్‌పైనే ఉండటంతో లక్ష మందిని సమీకరించడం ఆయనకు ఒక కీలక సవాలుగా మారింది. అనుకున్న స్థాయిలో జనసమీకరణ జరిగితే రాష్ట్ర బీజేపీలో ఆయన రాజకీయ పలుకుబడి మరింత బలపడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమాన్ని కేవలం జాతీయ అధ్యక్షుడికి స్వాగతం పలికే వేడుకగా మాత్రమే చూడకుండా 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పోటీకి సన్నద్ధంగా క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే పనిగా బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నవంబర్ 23న కరీంనగర్ వేదికగా జరగనున్న ఈ సభ రాబోయే ఎన్నికల వ్యూహాలకు ఒక దిక్సూచిగా మారనుందా? లేక బండి సంజయ్ నిర్దేశించుకున్న లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందా? అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.