Begin typing your search above and press return to search.

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించడంతో ముందస్తు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ విమర్శలు గుప్పించగా, భారత్ సమ్మిట్ ఖర్చులపై కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

By:  Garuda Media   |   14 Nov 2026 4:14 PM IST
కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన రాజ‌కీయంగా కాక రేపింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 'భారత్ సమ్మిట్` స‌హా గిగ్ వ‌ర్క‌ర్ల‌కు సంబంధించిన ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ శ‌నివారం హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. అయితే.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను మ‌రిచిపోయార‌ని ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో తార్నాకలోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ముందుజాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని బీజేవైఎం ప్రకటించిన నేపథ్యంలో మరికొందరు నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా ఇతర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఆరోపించింది. అదనంగా, 'భారత్ సమ్మిట్' పేరుతో దేశ వ్యతిరేక శక్తులను ఆహ్వానిస్తున్నారని ఆరోపించింది.

ఈ క్ర‌మంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే.. పోలీసులు ముందుగానే స్పందించి.. బీజేపీ నాయ‌కుల‌ను అరెస్టు చేశారు. కీల‌క నేత‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై రామ‌చంద‌ర్‌రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ హౌస్ అరెస్టులు అక్రమమని, శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. అక్రమ నిర్బంధాలతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నాయ‌కులు స్పందిస్తూ.. తెలంగాణలోని కీలక సమస్యలను పక్కన పెట్టి రాహుల్ గాంధీ ఈ సమ్మిట్‌లో పాల్గొనడం ఏంట‌మి ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఈ సమ్మిట్ ఖర్చుల విషయంలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో మూడేళ్ల పాల‌న‌లో ఒక్క‌రికైనా న్యాయం జ‌రిగిందా? ఒక్క పెట్టుబ‌డి అయినా తీసుకువ‌చ్చారా? రాహుల్‌గాంధీకి స‌లాం చేయ‌డం వ‌రకే నాయ‌కులు ప‌రిమితం అయ్యార‌ని వ్యాఖ్యానించారు.