ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?
అధికారంలో ఎవరుంటే వారికి అనుగుణంగా నిర్ణయాలుంటాయి.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భోళాశంకరుడిలా అందరికీ వరాలు ఇచ్చేశాడు.
By: A.N.Kumar | 6 Nov 2026 4:15 PM ISTఅధికారంలో ఎవరుంటే వారికి అనుగుణంగా నిర్ణయాలుంటాయి.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భోళాశంకరుడిలా అందరికీ వరాలు ఇచ్చేశాడు. తన కొడుకు నియోజకవర్గమైన చిన్న పట్టణం సిరిసిల్లను ఏకంగా జిల్లా చేసేశాడు. నారాయణపేట లాంటి చిన్న ప్రాంతాలను కూడా అక్కడి వారు ఆందోళన చేస్తే పోనీలే అని జిల్లా ప్రకటించారు. ఇప్పుటికే చాలా చిన్న జిల్లాలతో తెలంగాణలో స్వరూపం మారిపోయింది. పాలన చేరువైందని అనుకున్నా మరీ చిన్న జిల్లాలతో అవసరమా ఇన్ని అనే చర్చ కూడా కొందరి నుంచి వచ్చింది.
అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొన్ని జిల్లాలను తగ్గించి జిల్లాల పునర్విభజన చేస్తారని ప్రకటించారు. ఈ మేరకు ఈ తేనెతుట్టె లాంటి జిల్లాల పునర్విభజనను కదిపారు. కానీ ఆయా ప్రాంతాల నుంచి.. నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రక్రియను ఆపుకున్నారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి , తనకు బంధువు అయిన జైపాల్ రెడ్డి పేరుతో తాను కొత్తగా తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ని జిల్లా గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం.
అంతర్జాతీయ ప్రమానాలతో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్.. తెలంగాణ రాజకీయ.. పరిపాలనా వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ.. మరోవైపు పెరుగుతున్న పాలనాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ శివార్లలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఎస్. జైపాల్‌రెడ్డి పేరును ఈ ప్రతిపాదిత జిల్లాకు ఖరారు చేయవచ్చన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో అత్యాధునిక మౌలిక వసతులు.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు.. పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేవలం ఒక ప్రాజెక్ట్‌గా కాకుండా భవిష్యత్ ఆర్థిక ఇంజిన్‌గా మారుతున్న ఈ ప్రాంతానికి ప్రత్యేక పాలనా యంత్రాంగం అత్యవసరమని సీఎం రేవంత్ ఈ కొత్త జిల్లా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు సమాచారం..
ప్రస్తుతం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం, పారిశ్రామిక కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ అపూర్వమైన వృద్ధిని సాధిస్తున్నాయి. మరోవైపు కల్వకుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాలు కూడా హైదరాబాద్ దక్షిణ వలయంతో ప్రత్యక్ష ఆర్థిక, రవాణా సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీని కేంద్ర బిందువుగా చేసుకుని ఒక ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తే.. యావత్ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను ఒకే గొడుగు కింద సమన్వయం చేయడం సులభతరమవుతుందని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ తూర్పు శివారు ప్రాంతమైన హయత్నగర్ను కూడా ఈ జిల్లా పరిధిలోకి చేర్చే అంశంపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఎస్. జైపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాడ్గుల మండలం కూడా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంతో విడదీయరాని బంధం ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా కొత్త జిల్లాలో కలపాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రాబోయే జనగణన నేపథ్యంలో జిల్లాల పరిపాలనా సరిహద్దులను 2027 మార్చి 31 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు. ఈ నిబంధన కారణంగా ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడింది. గడువు ముగిసిన తర్వాతే ఈ కొత్త జిల్లా ప్రతిపాదనలపై అధికారిక ముద్ర పడే అవకాశం ఉంది.
తెలంగాణ ఏర్పడ్డప్పుడు కేవలం 10 జిల్లాలు ఉండేవి. కేసీఆర్ వాటిని 33 జిల్లాలకు చేర్చారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కేంద్రం మరో జిల్లా తెరపైకి వస్తే రాష్ట్రాల జిల్లాల స్వరూపం మరోసారి సమూలంగా మారవచ్చు. ప్రస్తుతం అసంబద్ధంగా ఉన్న జిల్లాలను అటూ ఇటూ మార్చే అవకాశాలున్నాయి.. దీంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
