ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?
దివంగత నాయకుడు, ఉమ్మడి ఏపీకి దాదాపుగా ఎనిమిదిన్నరేళ్ళ పాటు పాలించి మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కొన్ని కీలక పరిణామాలు ఆనాడు దారి తీశాయి.
By: Satya P | 4 Nov 2026 11:31 PM ISTదివంగత నాయకుడు, ఉమ్మడి ఏపీకి దాదాపుగా ఎనిమిదిన్నరేళ్ళ పాటు పాలించి మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కొన్ని కీలక పరిణామాలు ఆనాడు దారి తీశాయి. అందులో ముఖ్యమైనది ఆత్మ గౌరవం. తెలుగు వారికి ఆత్మగౌరవం అంతా ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెడుతున్నారు అని ఎన్టీఆర్ ఆనాడు ఉమ్మడి ఏపీ అంతా తిరిగి నలు చెరగులా ప్రచారం చేశారు. అది వజ్రాయుధంగా మారి అప్పటికి మూడు దశాబ్దాల పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో కూల్చివేసింది. అలా పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే టీడీపీ అధికారం అందుకుంది అంటే దాని వెనక అంతటి పవర్ ఫుల్ నినాదం ఉంది అన్న మాట.
కేటీఆర్ మాటలలో :
మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ నినాదం బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోట వినిపిస్తోంది. తాజాగా ఆయన పార్టీ సమావేశాలలో మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇద్దరూ ఢిల్లీలో వారి పార్టీ అధినేతల ముందు తల వంచుతున్నారని ఘాటు కామెంట్స్ చేశారు. ఢిల్లీ వెళ్ళిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నది లేకుండా కాంగ్రెస్ అగ్ర నేతల ముందు భయపడిపోతున్నారని నిందించారు. ఇది తెలంగాణా ఆత్మ గౌరవం కాదా అన్నారు.
కేంద్ర మంత్రిగా ఉంటూ :
తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయనకు దారి సరి చేస్తూ పాదయాత్రలో వ్యవహరించిన తీరుని కూడా కేటీఆర్ తప్పుపట్టారు. అసలు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా బండి సంజయ్ కి కేంద్ర మంత్రిగా తాము ఉన్నామని గమనించుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అగ్ర నేతలు తెలంగాణా నాయకులను తగ్గించి చూస్తున్నారు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ సంచులు మోసే పార్టీగా బీజేపీ చెప్పులు మోసే పార్టీగా మారిందని హాట్ కామెంట్స్ చేశారు.
మనమే ఉండాలి :
తెలంగాణా ఆత్మ గౌరవం నిలబెట్టాలీ బీఆర్ఎస్ మాత్రమే ఉండాలని ఆయన అన్నారు. ఢిల్లీ పాలకులను నిలదీయాలంటే బలమైన ప్రాంతీయ పార్టీల అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే జాతీయ పార్టీలను అంతా వ్యతిరేకించాలని కేటీఆర్ కోరారు. ఆయన అలా నినదించడం ఇపుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. తెలంగాణాలో రెండు జాతీయ పార్టీల మధ్యలో బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ ఉంది. ఆ రెండు జాతీయ పార్టీలు ప్రజలకు మేలు చేయలేవని ప్రచారం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ ఇపుడు రూట్ మార్చింది అని అంటున్నారు.
నినాదానికి పదును :
ఆత్మ గౌరవ నినాదం తీసుకుని వస్తోందని గుర్తు చేస్తున్నారు. ఈ నినాదం ఎన్టీఆర్ టీడీపీకి ఇంధనంగా పనిచేసింది. అదే తీరున బీఆర్ఎస్ జనంలోకి వెళ్లాలని చూస్తోందా అన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సాధన అంతా నీరు నిధులు నియామకాలతో పాటు ఆత్మ గౌరవ పోరాటం మీదనే ఆధారపడి సాగింది. అందుకే బీఆర్ఎస్ మరోసారి ఈ నినాదానికి పదును పెడుతోంది అని అంటున్నారు. అయితే హైకమాండ్ కి జవాబు దారీగా ఉండడంలో తప్పేంటి అని కాంగ్రెస్ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వక్ర భాష్యాలు బీఆర్ఎస్ చేస్తోంది అని విమర్శిస్తున్నాయి.
