హైదరాబాద్‌లో ఉగ్రదాడుల బెదిరింపు.. 26/11 తరహా దాడులకు కుట్ర?
హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడులు జరుపుతామని, 300 మందిని లక్ష్యంగా చేసుకుంటామని వచ్చిన బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాపై దాడి చేస్తామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తమై ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమెయిల్ మూలాలపై దర్యాప్తు చేపట్టారు.
By: A.N.Kumar | 23 Nov 2026 8:06 AM ISTహైదరాబాద్ లో ఉగ్రదాడుల బెదిరింపు ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ పోలీసు యంత్రాంగానికి అందిన ఓ బెదిరింపు సందేశం ఒక్కసారిగా భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసింది. 2008 నాటి ముంబై 26/11 ఉగ్రదాడుల తరహా మారణహోమాన్ని హైదరాబాద్‌లో పునరావృతం చేస్తామని.. కనీసం 300 మంది అమాయకుల ప్రాణాలను బలిగొనడమే తమ లక్ష్యమని ఆ మెయిల్‌లో పేర్కొనడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ బెదిరింపు ఈమెయిల్‌లో ప్రధానంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు సమీపంలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుంటామని దుండగులు హెచ్చరించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల చేతిలో హతమైన లష్కరే తోయిబా టాప్ కమాండర్.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే హైదరాబాద్‌పై ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆ మెయిల్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ బెదిరింపు సమాచారం అందిన తక్షణమే హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా రంగంలోకి దిగి లోతైన దర్యాప్తును ప్రారంభించాయి. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది? ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? దీని వెనుక నిజంగానే ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా? లేక ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా ఆకతాయిలు చేసిన ఆకతాయి పనా? అనే కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రముఖ హోటళ్లు, షాపింగ్ మాల్స్ , ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు.. వాహనాలు.. గుర్తుతెలియని వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని.. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో త్వరలోనే తేలనుంది.
