కారు నాది.. పెట్రోల్ నాది.. రోడ్డుపై వెళ్లాలంటే ట్యాక్స్ కట్టాలా? హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్‌పై నెటిజన్ల సెటైర్లు
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు పీక్ అవర్స్‌లో కారులో ఒక్కరే ప్రయాణిస్తే అదనపు ఛార్జీ విధించాలని పరిశోధకులు ప్రతిపాదించారు. సైబర్ టవర్స్ వద్ద గంటకు 10 వేలకుపైగా వాహనాలు వెళ్తుండగా, 6,550 కార్లలో డ్రైవర్లు ఒక్కరే ఉంటున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
By: A.N.Kumar | 26 Nov 2026 11:17 AM ISTహైదరాబాద్ రోడ్లపై ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. భాగ్యనగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి పరిశోధకులు ఒక వింత ఆలోచనతో ముందుకొచ్చారు. అదే 'కంజెషన్ ఛార్జింగ్'. అర్థం కాలేదా? అంటే ముఖ్యంగా ఐటీ కారిడార్ వంటి రద్దీ ప్రాంతాల్లో పీక్ అవర్స్‌లో కారులో ఒక్కరే ప్రయాణిస్తే అదనంగా ట్యాక్స్ లేదా జరిమానా వసూలు చేయాలన్నది వీరి ప్రతిపాదన. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
కారు కొనేటప్పుడు లక్షలు పోసి కొంటాం.. రోడ్ ట్యాక్స్.. రిజిస్ట్రేషన్.. ఇన్సూరెన్స్.. పెట్రోల్.. టోల్ గేట్లు.. ఇలా అడుగడుగునా జేబుకు చిల్లు పడుతూనే ఉంటుంది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు పక్క సీటులో ఎవరినైనా కూర్చోబెట్టుకోకపోతే ఫైన్ వేస్తాం అనడం వాహనదారులకు మింగుడుపడటం లేదు. కారు నాది.. పెట్రోల్ నాది.. స్టీరింగ్ తిప్పేది నేనే.. మధ్యలో పక్క సీటు ఖాళీగా ఉంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఇకపై ఆఫీసుకు వెళ్లేటప్పుడు ల్యాప్‌టాప్.. లంచ్ బాక్స్‌తో పాటు పక్క సీటులో కూర్చోబెట్టుకోవడానికి ఒక బొమ్మను కూడా కొనుక్కోవాలేమో.. అని జోకులు పేలుస్తున్నారు.
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, కార్డిఫ్ యూనివర్సిటీ, కింగ్ ఫహద్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి చేసిన ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన నిజం బయటపడింది. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వద్ద గంటకు 10 వేలకు పైగా వాహనాలు వెళ్తుంటే అందులో దాదాపు 6,550 కార్లలో డ్రైవర్ ఒక్కరే ప్రయాణిస్తున్నారట. అంటే రోడ్డు నిండా కార్లే ఉంటున్నాయి కానీ వాటిలో ప్రయాణించే మనుషులు మాత్రం తక్కువగా ఉంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సింగపూర్, లండన్ తరహాలో హైదరాబాద్‌లోనూ పైలట్ ప్రాజెక్టుగా కంజెషన్ ఛార్జీలు విధించాలని వారు సూచించారు.
ఒకవేళ ఈ రూల్ నిజంగానే అమల్లోకి వస్తే ఐటీ ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులై ఉండి వారి ఆఫీసులు చెరో దిక్కున ఉంటే పరిస్థితి ఏంటి? ఒకరిని డ్రాప్ చేసి మరొకరు ఆఫీసుకు వెళ్లేసరికి సగం రోజు గడిచిపోతుంది. ఇక రాత్రి పూట షిఫ్టులు ముగించుకుని ఇంటికి వెళ్లేవాళ్లు.. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి పరుగెత్తేవాళ్లు అప్పుడు కూడా రోడ్డుపై నిలబడి ఎవరైనా లిఫ్ట్ కావాలా? అని అడుక్కోవాలా అన్నది సామాన్యుల ప్రశ్న.
ట్రాఫిక్ జామ్‌కు కేవలం సింగిల్ డ్రైవర్ కార్లే కారణమా? రోడ్లపై ఆక్రమణలు.. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్.. కనీసం నడవడానికి కూడా వీల్లేని ఫుట్‌పాత్‌లు.. మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసులకు వెళ్లడానికి సరైన ఫీడర్ బస్సులు లేకపోవడం.. ఇవన్నీ అసలైన సమస్యలు. ప్రజా రవాణా వ్యవస్థను గాలికి వదిలేసి.. గత్యంతరం లేక సొంత కార్లు వాడుతున్న వారిపై ఇలాంటి సోలో ట్యాక్స్ వేయడం ఎంతవరకు న్యాయమని నగరవాసులు నిలదీస్తున్నారు.
ట్రాఫిక్ తగ్గించాలన్న ఆలోచన మంచిదే అయినా.. ముందుగా రోడ్లు, ప్రజా రవాణాను బాగు చేయకుండా ఇలాంటి రూల్స్ పెడితే సామాన్యుడికి చుక్కలు కనిపించడం ఖాయం..
