Begin typing your search above and press return to search.

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

సైబరాబాద్ పరిధిలో 100 మందికి పైగా పాల్గొనే పార్టీలు, ఫంక్షన్లు, బహిరంగ సభలు నిర్వహించాలంటే మూడు పని రోజుల ముందే స్థానిక సంస్థకు సమాచారం ఇవ్వాలి. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అధీకృత ఏజెన్సీలకు అప్పగించాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

By:  Madhu Reddy   |   19 Nov 2026 10:00 PM IST
పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?
X

సాధారణంగా ఎక్కడైనా సరే పార్టీలు కానీ , ఫంక్షన్లు కానీ జరిగాయి అంటే జరిగిన ఆ సమయం.. అక్కడ ఎంతో అందంగా అలంకరించబడి ఉంటుంది. ఒక్కసారి ఆ పార్టీ గాని ఫంక్షన్ గాని అయిపోయిందంటే ఆ ప్రదేశం ఎంత చెత్తగా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం మరీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పార్టీలు లేదా ఫంక్షన్లు పూర్తయిన తర్వాత ఏర్పడే వీటి చెత్త పర్యావరణానికి కూడా హానిని కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా పార్టీ, సమావేశాలు ,బహిరంగ సభలు , ఫంక్షన్ నిర్వాహకులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదు దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇకపై రూల్స్ అతిక్రమిస్తే శిక్ష తప్పదు అంటూ హుకుం జారీ చేశారు. మరి అసలేంటో ఇప్పుడు చూద్దాం

కార్పొరేషన్ పరిధిలో భారీగా జరిగే వేడుకలు, బహిరంగ సభలు, సమావేశాలు , ఫంక్షన్ ల నిర్వహణ విషయంలో కఠిన నిర్ణయాలకు సిద్ధం అయ్యారు సైబరాబాద్ కమిషనర్. వేడుకల పేరుతో ఎక్కడపడితే అక్కడ చెత్త వేసి చేతులు దులుపుకునే నిర్వాహకల తీరుకు అడ్డుకట్ట వేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. అందులో భాగంగానే వందమందికి పైగా పాల్గొనే ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా సరే.. కనీసం మూడు పని రోజుల ముందే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పోర్టల్ ద్వారా స్థానిక సంస్థకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

అంతేకాదు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలోని రూల్ 5(1)(జే) ప్రకారం ఈ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని తడి చెత్త , పొడి చెత్తను వేరు చేసి ఆథరైజ్డ్ ఏజెన్సీలకు ఇవ్వాలి అని సీఎంసీ పరిధిలోని డెప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.

అంతేకాదు అనుమతులు లేని బహిరంగ సభ ప్రదేశాలలో జరిగే సమావేశాలు, ఈవెంట్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని, తమ పరిధిలోని ఫంక్షన్ హాల్ యాజమాన్యాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు నిర్వహకులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి అంటూ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సిఎంసి పరిధిలో పరిశుభ్రతను కాపాడడానికి ఈ ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపిన ఆయన.. పోర్టల్ వినియోగంపై అవగాహన కల్పించడంతోపాటు శానిటేషన్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నిరంతరం ఆదేశాలు అమలు అయ్యేలా పర్యవేక్షించాలని కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే కమిషనర్ తీసుకొచ్చిన ఈ రూల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇలాంటి రూల్స్ అన్ని ప్రదేశాలలో వస్తే ఇకపై చెత్తకు చోటు ఉండదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

శుభ్రతపై అవగాహన ఉన్న కొంతమంది పాటించకపోవడం, పరిసరాలను అపరిశుభ్రంగా మార్చడం పర్యావరణానికి హాని కలిగించడం లాంటి పనుల వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అందుకే ఇలాంటి ఆంక్షలు విధిస్తే కచ్చితంగా ఇటువంటి ఇబ్బందులకు చోటు ఉండదు అంటూ ప్రజలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇలాంటి రూల్స్ అన్నిచోట్ల రావాలని కూడా కోరుకుంటుండడం గమనార్హం.