తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?
తెలంగాణ రాజకీయ రంగస్థలంపై స్థానాన్ని మరింత బలపరుచుకునేందుకు భారతీయ జనతా పార్టీ తన శక్తులన్నింటినీ ఒడ్డుతోంది.
By: A.N.Kumar | 2 Nov 2026 3:20 PM ISTతెలంగాణ రాజకీయ రంగస్థలంపై స్థానాన్ని మరింత బలపరుచు కునేందుకు భారతీయ జనతా పార్టీ తన శక్తులన్నింటినీ ఒడ్డుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న భారీ పాదయాత్ర.. బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 'లోక్తంత్ర బచావో - అరాచకత్వ హటావో' నినాదంతో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి మొజంజాహీ మార్కెట్ వరకు సాగే ఈ కార్యక్రమం కేవలం ఒక సాధారణ ర్యాలీ మాత్రమే కాదు.. ఇది కమలనాథుల భవిష్యత్ రాజకీయ ప్రణాళికకు ఒక అద్దం.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన 'ఓట్ బచావో - దేశ్ బచావో' నినాదానికి ప్రతిస్పందనగానే బీజేపీ ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నేరుగా దండెత్తేందుకు అమిత్ షా ఈ వేదికను వాడుకోనున్నారు. ఆరు గ్యారెంటీల అమలు.. ప్రజా సమస్యలు.. పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేయాలనేది బీజేపీ వ్యూహం.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుండి లక్ష మందిని సమీకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్రాధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నేతృత్వంలో క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.
అయితే రాజకీయాల్లో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. భారీ జనసమీకరణ ఎంత ముఖ్యమో.. ఆ జనాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం అంతకంటే ముఖ్యం. మీడియా దృష్టిని ఆకర్షించి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి అమిత్ షా వంటి అగ్రనేతల పర్యటనలు తోడ్పడతాయి. కానీ అది ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించాలంటే స్థానిక నాయకత్వం నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లను తమకు అనుకూలంగా మలుచుకుని.. కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయ శక్తి తామేనని చాటడం బీజేపీ ప్రధాన ఉద్దేశం. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ఈ పాదయాత్ర ఒక 'సెమీఫైనల్' వంటి వాతావరణాన్ని సృష్టిస్తోంది.
అమిత్ షా పాదయాత్ర బీజేపీకి కావాల్సిన రాజకీయ ‘హైప్’ను నిస్సందేహంగా తెచ్చిపెడుతుంది. అయితే కేవలం జాతీయ నేతల ప్రచారాలు.. ర్యాలీలతోనే అధికార పీఠం సాధ్యపడదు. స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం, బూత్ స్థాయి బలమైన యంత్రాంగం, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే పక్కా వ్యూహం ఉన్నప్పుడే ఈ 'హైప్' కాస్తా 'ఓట్లు'గా మారే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహం తెలంగాణ రాజకీయ చిత్రాన్ని ఎంతవరకు మారుస్తుందో వేచి చూడాలి.
