Begin typing your search above and press return to search.

కవితక్క టీఆర్ఎస్ కి పేరు మార్పు తప్పదా ?

కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై 1,100కు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ నోటీసులు ఇచ్చినా, పేరు మార్చేందుకు కవిత ఇష్టపడటం లేదని సమాచారం. పార్టీ పేరు, గుర్తు రిజిస్ట్రేషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆమె హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

By:  Satya P   |   27 Nov 2026 9:26 AM IST
కవితక్క  టీఆర్ఎస్ కి పేరు మార్పు తప్పదా ?
X

టీఆర్ఎస్ అంటే తెలంగాణాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపించేది గులాబీ జెండానే. అయితే కేసీఆర్ తన పార్టీ పేరుని 2022లో బీఆర్ఎస్ గా మార్చేశారు. దాంతో అదే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె కవిత తన సొంత పార్టీకి తెలంగాణా రక్షణ సేన షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నారు. ఇపుడు ఆ పేరే కవితకు చిక్కులు తెచ్చి పెడుతోంది అని అంటున్నారు. అధికారిక గుర్తింపు రావడానికి ఈసీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు.

ఈసీ నోటీసులు :

ఇక కవిత పార్టీ పేరు విషయంలో టీఆర్ఎస్ గా వద్దు అంటూ అనేక అభ్యంతరాలు ఈసీకి వెళ్లాయని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే కనుక ఏకంగా పదకొండు వందలకు పైగా ఉన్నాయని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో కవితను ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ కి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే పేర్లను సూచించాలని ఈసీ నోటీసులు జారీ చేసింది అని చెబుతున్నారు. అయితే కవిత మాత్రం తన పార్టీ పేరుని తెలంగాణా రక్షణ సేన షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అన్న పేరును మార్చడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. అంతే కాదు ఈసీకి కూడా ఆమె అదే బదులు ఇచ్చారని తెలుస్తోంది.

ఈసీ ఏమి చేస్తుంది :

ఇక తెలంగాణాలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీ తరఫున అభ్యర్ధులను నిలబెట్టడానికి కవిత నిర్ణయించారు. దాని కోసం పార్టీ పేరు ఎన్నికల గుర్తు అధికారిక ముద్ర అవసరం. అయితే టీఆర్ఎస్ పేరు మీద ఉన్న అభ్యంతరాల నేపధ్యంలో ఈసీ అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పేరు మార్పునకు కవితకు సూచించినా ఆమె టీఆర్ఎస్ ఉండాల్సిందే అని అంటున్నారు. దాంతో ఈసీ ఇపుడు ఏమి చేస్తుంది అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.

హైకోర్టులో కేసు :

మరో వైపు చూస్తే తన పార్టీ పేరుని అలాగే గుర్తుని అధికారికంగా అందించే విషయంలో ఈసీ నిర్ణయం త్వరగా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో కవిత ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు. అలాగైతే తన పార్టీ రిజిస్ట్రేషన్ తొందరగా జరుగుతుందని ఆమె భావిస్తున్నారు. మరి కోర్టులో ఏమి తేలుతుందని చూడాల్సి ఉంది. ఇంతలో కనుక ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మాత్రం కవిత టీఆర్ఎస్ పేరుతో ఆమె అభ్యర్ధులు పోటీ చేయలేరని అంటున్నారు. వారు ఇండిపెండెంట్లుగానే పరిగణించబడతారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే టీఆర్ఎస్ అన్నది సెంటిమెంట్ గా కవిత భావించడం వల్లనే ఆ పేరుని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. కానీ ఈసీ అయితే నిబంధలన ప్రకారం చూస్తుందని చెబుతున్నారు. అభ్యతరాలు కనుక వస్తే వేరే పేర్లను ప్రత్యామ్నాయ మార్గాలుగా సూచిస్తుందని అంటున్నారు. మరి ఈసీ సానుకూలంగా స్పందిస్తుందనే కవిత వర్గీయులు ఆశాభావంగా ప్రస్తుతానికి ఉన్నారు. పేరులో ఏముంది అనుకోవడానికి లేదు, రాజకీయాల్లో అదే సిరి కాబట్టి. అందువల్ల టీఆర్ఎస్ అన్న పేరుని పార్టీ పరంగా సాధిస్తే కనుక కవిత విజయం సాధించినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.