Begin typing your search above and press return to search.

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

నవంబర్‌లో మైక్రోసాఫ్ట్ సేవలు, అమెరికా విమానయాన వ్యవస్థలు, జేపీ మోర్గాన్ బ్యాంకింగ్ సేవల్లో సాంకేతిక అంతరాయాలు కలకలం రేపాయి. మరోవైపు సైబర్ దాడులతో ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లు, కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడ్డాయి. కీలక రంగాలు డిజిటల్ వ్యవస్థలపై అతిగా ఆధారపడితే ఎదురయ్యే ముప్పును ఈ పరిణామాలు చాటిచెప్పాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థలు, పటిష్టమైన సైబర్ భద్రత అవసరాన్ని మరోసారి గుర్తుచేశాయి.

By:  A.N.Kumar   |   18 Nov 2026 4:59 PM IST
టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్
X

ఒక్క క్లిక్‌తో ప్రపంచం మన చేతుల్లోకి వచ్చేసింది.. బ్యాంకింగ్ నుంచి విమాన ప్రయాణాల వరకు.. ఆఫీసు పనుల నుంచి వ్యక్తిగత సమాచార భద్రత వరకు ప్రతిదీ డిజిటల్ మయం అయిపోయింది. అయితే అదే టెక్నాలజీ ఒక్కసారిగా మొరాయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ నవంబర్ ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా ప్రముఖ టెక్ సంస్థలు.. బ్యాంకులు.. విమానయాన సంస్థల సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాలు కలకలం రేపాయి. దీంతో టెక్ ప్రపంచంలో నవంబర్ నెల ఒక పీడకలగా మారింది.

ఇప్పటివరకు టెక్నాలజీ అనేది మనిషి పనులను వేగవంతం చేసే ఒక ఉపయోగకర సాధనంగా చూశాం. కానీ ఇప్పుడు అదే వ్యవస్థలపై అతిగా ఆధారపడటం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్.. టీమ్స్.. కోపైలట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం నిరూపించింది. నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో కొన్ని సర్వర్లు పనిచేయకపోవడంతో మిగిలిన వాటిపై భారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు.. వ్యాపార సంస్థల రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సుమారు 36 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాతే సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

డిజిటల్ వ్యవస్థలపై విమానయాన రంగం ఎంతగా ఆధారపడిందో అమెరికాలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. నవంబర్ 13న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నెట్‌వర్క్‌లో సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్త రూటర్ నుంచి అధిక మొత్తంలో డేటా రావడంతో నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెరిగి.. ఏకంగా 10 వేలకుపైగా విమానాలు రద్దు కావడం గంటల తరబడి ఆలస్యంగా నడవడం చుక్కలు చూపించింది. ఆ వెంటనే నవంబర్ 16న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో టెక్నికల్ సమస్య కారణంగా పైలట్లు ఉపయోగించే అప్లికేషన్లు మూలనపడటంతో ప్రయాణికులు నానా తంటాలు పడ్డారు.

బ్యాంకింగ్ రంగంలోనూ సాంకేతిక లోపాలు వినియోగదారులను నిద్ర లేకుండా చేశాయి. జేపీ మోర్గాన్ చేజ్‌లో ఏర్పడిన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా వేలాది మంది ఖాతాదారులు తమ సొంత ఖాతాలను సైతం యాక్సెస్ చేయలేకపోయారు. అత్యవసర సమయంలో ఏటీఎం లావాదేవీలు.. డిజిటల్ చెల్లింపులు ఆగిపోవడంతో ప్రజలు అరిగోస పడ్డారు. మన అకౌంట్‌లో డబ్బులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునే డిజిటల్ మార్గం ఒక్క క్షణం మూసుకుపోతే జీవితం ఎంత సంక్షోభంలో పడుతుందో ఈ ఘటన కంటతడి పెట్టించింది.

మరోవైపు టెక్నికల్ లోపాలతో పాటు సైబర్ దాడులు ఈ నెలలో మరింత భయపెట్టాయి. వెబ్‌సైట్ టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ ఆప్టిమైజ్లీలోని లొసుగును ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు 178 ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లలో మాల్‌వేర్‌ను చొప్పించారు. జూమ్, బీబీసీ, సీఎన్ఎన్, హెచ్‌ఎస్‌బీసీ వంటి దిగ్గజ సంస్థల సైట్లు కూడా దీనిబారిన పడ్డాయి. డచ్ షిప్పింగ్ దిగ్గజం మెర్స్క్‌కు చెందిన 100 జీబీ డేటాను దొంగిలించి ఐదు మిలియన్ డాలర్ల బిట్‌కాయిన్‌ను డిమాండ్ చేయడం.. ఫ్రాన్స్‌కు చెందిన మైలెవాపై జరిగిన దాడిలో 2.2 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్ కావడం డిజిటల్ భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

ఈ విపత్తులన్నింటినీ విడివిడిగా చూస్తే చిన్న సాంకేతిక లోపాలుగా అనిపించవచ్చు. కానీ వీటి అంతరార్థం ఒక్కటే ప్రపంచంలోని కీలక వ్యవస్థలన్నీ ఒకదానిపై మరొకటి గొలుసుకట్టులా ఆధారపడి ఉన్నాయి. ఒక సర్వర్‌లో సమస్య వస్తే దాని ప్రభావం క్షణాల వ్యవధిలో బ్యాంకింగ్.. రవాణా.. కమ్యూనికేషన్ రంగాలపై పడుతోంది. అందుకే టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నది మాత్రమే కాదు.. అది విఫలమైనప్పుడు ఎంత త్వరగా కోలుకోగలమన్నది కూడా నేడు అత్యంత కీలకంగా మారింది.

టెక్నాలజీని గుడ్డిగా నమ్మడం మానేసి.. సంస్థలు ముందస్తు పరీక్షలు నిర్వహించడం.. ప్రత్యామ్నాయ సర్వర్లను సిద్ధం చేసుకోవడం అత్యవసరం. వినియోగదారులు కూడా డిజిటల్ చెల్లింపులతో పాటు కొంత భద్రతా నగదును చేతిలో ఉంచుకోవడం మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో ప్రతి నవంబర్ మన టెక్ రంగానికి మరింత పెద్ద పీడకలగా మారుతుంది..