పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..
తెలుగు రాష్ట్రాల గ్రామీణ రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఏఐ, సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. గతంలో ఫ్లెక్సీలు, ప్రచార పాటలకే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు చాట్‌జీపీటీతో రూపొందించే పోస్టర్లు, మీమ్స్, కార్టూన్లకు మారింది. తక్కువ ఖర్చుతో అభ్యర్థులను భారీ జనసమూహాల మధ్య చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెటైరికల్ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఏఐతో ప్రచార హంగామా సృష్టించవచ్చుగానీ, వాస్తవ అభివృద్ధికి అది ప్రత్యామ్నాయం కాదని, తప్పుడు ప్రచారాల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని చర్చ సాగుతోంది.
By: A.N.Kumar | 20 Nov 2026 12:16 PM ISTఒకప్పుడు పల్లెటూరిలో ఎన్నికలంటే.. పొద్దున్నే మైకుల్లో హోరెత్తే ప్రచార పాటలు.. గోడల నిండా సున్నంతో రాసిన గుర్తులు.. గడపగడపకూ తిరిగి దండాలు పెట్టే అభ్యర్థులు కనిపించేవారు... కానీ ఇప్పుడు సీన్ మారింది.. అభ్యర్థి గడప తొక్కకముందే ఆయన సినిమా హీరో రేంజ్ పోస్టర్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. ప్రత్యర్థి ఓటర్లను కలిసి నమస్కారం పెట్టకముందే.. ఆయనపై ఓ సెటైరికల్ మీమ్ ఊరంతా వైరల్ అయిపోతోంది. పల్లె రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన కింగ్ మేకర్ ఎవరో తెలుసా? ఎవరో రాజకీయ చాణక్యుడు కాదు.. చేతిలో స్మార్ట్‌ఫోన్.. దాంట్లో చాట్‌జీపీటీ ఉన్న మన ఊరి కుర్రాడే..
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ రాజకీయాల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గతంలో ఫ్లెక్సీ వేయాలంటే డిజైనర్ చుట్టూ తిరగాలి.. వేలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఆ బాధే లేదు. ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు.. ఎప్పుడూ ఊరు దాటని అభ్యర్థి కూడా విదేశీ రేంజ్ డెవలప్మెంట్ చేసినట్లు.. వేలాది మంది జనసమూహం మధ్య సింహంలా గర్జిస్తున్నట్లు ఏఐ చిటికెలో బొమ్మ గీసి ఇచ్చేస్తోంది. ఉచిత అకౌంట్ల పరిమితి అయిపోతే ఇంకో మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వడం.. తక్కువ ధర ప్లాన్లతో ప్రచారాన్ని పరుగులు పెట్టించడం మన కార్యకర్తలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
ఈ డిజిటల్ దెబ్బకు ఊరి చివర ఉండే ఫ్లెక్సీ డిజైనర్ల పొట్ట కొట్టినంత పనైంది. పాపం వాళ్లు ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఓపెన్ చేసేలోపే మన వాట్సాప్ వీరులు నాలుగు మీమ్స్ వదిలి ఐదో పోస్టర్‌కు రెడీ అవుతున్నారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.. అసలు పోటీ అభ్యర్థుల మధ్య జరుగుతుందా లేక ఈ ఏఐ క్రియేటర్ల మధ్య జరుగుతుందా అన్నది అర్థం కావడం లేదు.. కొన్నిసార్లు అభ్యర్థి పెట్టిన అసలు ప్రచార సభ కంటే.. ఆ సభపై ప్రత్యర్థి వర్గం వదిలిన కామెడీ కార్టూన్‌కే ఎక్కువ లైకులు.. షేర్లు వస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇక్కడే అసలు మతలబు ఉంది. ఏఐ వాడి అభ్యర్థిని బాహుబలి లా చూపించవచ్చు.. ప్రత్యర్థిని బకరాలా మార్చవచ్చు. కానీ ఏఐ టూల్స్ వాడి ఊర్లో మంచినీళ్ల ట్యాంక్ కట్టలేం కదా.. ప్రాంప్ట్ ఇస్తే రోడ్ల మీద గుంతలు పూడవు కదా.. పైగా చేయని పనులు చేసినట్లు.. అనని మాటలు అన్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తే ఓటర్లు నమ్మడానికి ఇవేమీ 1980ల నాటి సినిమాలు కావు.
పల్లె రాజకీయాల్లో డిజిటల్ వార్ పీక్స్‌కు చేరింది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో గెలిచేది ఎక్కువ మేనిఫెస్టో హామీలు ఇచ్చిన వాళ్లా? లేక ఎక్కువ మీమ్స్ వైరల్ చేసిన వాళ్లా? అన్నది చూడాలి. ఓటు వేసే ముందు ఓటరు దేవుళ్లు ఏఐ మాయ లో పడతారో లేక అసలు నిజం తెలుసుకుంటారో వేచి చూడాలి.
