డిస్నీ కొంపముంచిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..
హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ డిస్నీకి ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలిసిరాలేదు. జూటోపియా 2 వంటి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తే, మరికొన్ని సినిమాలు మాత్రం దారుణంగా దెబ్బతిన్నాయి.
By: M Prashanth | 1 Dec 2025 4:00 PM ISTహాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ డిస్నీకి ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలిసిరాలేదు. జూటోపియా 2 వంటి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తే, మరికొన్ని సినిమాలు మాత్రం దారుణంగా దెబ్బతిన్నాయి. అందులో అతిపెద్ద డిజాస్టర్ 'ట్రాన్: ఏరిస్'. ఎన్నో అంచనాల మధ్య, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అక్టోబరులో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 1000 కోట్ల నష్టాలను మిగిల్చి నిర్మాతలకు కన్నీళ్లు తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ ఖరారైంది.
థియేటర్లలో ప్లాప్ అయిన సినిమాలను త్వరగా ఓటీటీకి తీసుకురావడం ఈ మధ్య కామన్ అయిపోయింది. అలాగే 'ట్రాన్: ఏరిస్' కూడా డిసెంబర్ 2 డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి అడుగుపెడుతోంది. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది. ఇది నార్మల్ ఓటీటీ రిలీజ్ కాదు. అంటే మీ దగ్గర నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా ఈ సినిమాను ఫ్రీగా చూడలేరు. ఇది వీడియో ఆన్ డిమాండ్ పద్ధతిలో విడుదలవుతోంది. అంటే మనం సినిమా చూడాలంటే ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సినిమాను చూడాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, యూట్యూబ్ మూవీస్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో రెంట్ లేదా బై ఆప్షన్ ద్వారా డబ్బులు చెల్లించి చూడాలి. విదేశాల్లో అయితే సుమారు 20 నుంచి 30 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ మొత్తం చెల్లించి డిజిటల్ గా సినిమాను చూడటానికి జనాలు ఎంతవరకు ఆసక్తి చూపిస్తారో చూడాలి. భారతీయ ప్రేక్షకులకు ఇది రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్‌లో ఇప్పుడే అందుబాటులోకి రాదు. కాబట్టి ఓటీటీలో ఫ్రీగా చూడాలంటే ఇంకాస్త వెయిట్ చేయక తప్పదు.
లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమా ఫిజికల్ డిస్క్ రిలీజ్ 2026 జనవరి 6న ప్లాన్ చేశారు. సాధారణంగా ఫిజికల్ కాపీలు వచ్చినప్పుడే లేదా ఆ తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్‌కు సినిమాలు వస్తాయి. కాబట్టి బహుశా జనవరిలో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లేదా ఇతర ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు డబ్బులు పెట్టి చూడటం ఇష్టం లేని వారు జనవరి వరకు ఆగాల్సిందే.
జారెడ్ లెటో హీరోగా, జోచిమ్ రోనింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని పేరు వచ్చింది. నైన్ ఇంచ్ నెయిల్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. కానీ కథలో దమ్ము లేకపోవడం, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. ఏఐ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిస్నీకి కాస్ట్లీ మిస్టేక్‌గా మిగిలిపోయింది. విజువల్ స్పెక్టాకల్స్ ఇష్టపడే వారు డిజిటల్ రిలీజ్‌లో ఓసారి ట్రై చేయొచ్చు.
ఒక్క సినిమాతో వెయ్యి కోట్ల నష్టం అంటే సాధారణ విషయం కాదు. డిస్నీ లాంటి పెద్ద సంస్థకు కూడా ఇది గట్టి దెబ్బే. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికే ఇంత త్వరగా డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో ఆన్ డిమాండ్ ద్వారా వచ్చే ఆదాయంతో కొంతైనా గట్టెక్కాలని చూస్తున్నారు. మరి డిజిటల్ ఆడియన్స్ అయినా ఈ సినిమాను ఆదరిస్తారో లేక అక్కడా నిరాశే ఎదురవుతుందో చూడాలి.
