OTTలు వందల కోట్లు ఇచ్చేంత సీన్ లేదా?
ఏదేమైనా.. ఇప్పటి వరకు తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే హైయెస్ట్ ఓటీటీ డీల్.. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీదేని గుర్తు చేస్తున్నారు.
By: M Prashanth | 30 Dec 2025 3:45 PM ISTఓటీటీ ప్లాట్ ఫామ్ లు.. కొన్నేళ్లుగా ఉన్నా కూడా.. కోవిడ్ టైమ్ లోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మూవీ లవర్స్ ఆయా ఓటీటీలకు సబ్స్క్రైబర్లుగా మారారు. దీంతో తెలుగు సినిమాలకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు పోటీ పడుతూ మరీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేశాయి.
కొన్ని సినిమాలకు అయితే మార్కెట్ విలువకు మించిన రేట్లు కూడా లభించాయి. ఆ పరిస్థితులు నిర్మాతలకు ఎంతో లాభాన్ని చేకూర్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఓటీటీ సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకైనా సరే, గతంలోలా చెక్ లు రాసి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
ఖర్చులను తగ్గించుకోవడంపైనే అన్ని ప్లాట్ ఫామ్ లు దృష్టి పెట్టాయి. అప్పటిలా అస్సలు పోటీ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. కానీ కొంత కాలంగా ఆ సినిమాకు అన్ని వందల కోట్ల డీల్.. ఈ మూవీకి ఇన్ని వందల కోట్ల డీల్ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో రూమర్లు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి.
ఓవైపు ఓటీటీలు అప్పటిలా అస్సలు రేట్ ఇవ్వడం లేదని స్పష్టంగా తెలుస్తుండగా.. మరోవైపు మాత్రం మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీకి రూ.800 కోట్లు, అల్లు అర్జున్- అట్లీ కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్టుకు రూ.600 కోట్లను డీల్ రూపంలో ఓటీటీలు చెల్లిస్తున్నాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు సినీ పండితులు చెబుతున్నారు. అవన్నీ ఉత్తుత్తి వార్తలు అని.. ప్రమోషనల్ జిమ్మిక్స్ అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ లో ఏ ఓటీటీ సంస్థ కూడా అంత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించే అవకాశం.. ఒప్పందం చేసుకునే అవకాశం లేదని అంటున్నారు.
ఏదేమైనా.. ఇప్పటి వరకు తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే హైయెస్ట్ ఓటీటీ డీల్.. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీదేని గుర్తు చేస్తున్నారు. రిలీజ్ కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఆ సినిమాకు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ రూ.270 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పటి వరకు పుష్ప-2 రికార్డును ఓ సినిమా కూడా బ్రేక్ చేయలేదు.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అనేక భారీ సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి చేసుకుంటే రూ.300-350 కోట్ల వరకు కొన్ని సినిమాలకు డీల్ ఫిక్స్ అవ్వొచ్చట. అంతే కానీ రూమర్లు వస్తున్నట్లు రూ.600-800 కోట్లు చెల్లిస్తున్నాయని అనడం అసాధ్యమంటున్నారు నిపుణులు. మరి చూడాలి ఏం జరుగుతుందో..
