Begin typing your search above and press return to search.

ఈ వారం రిలీజ్‌ల‌లో బాక్సాఫీస్ బెస్ట్ ఏది? ఆ నాలుగింటిపైనే అంద‌రి దృష్టి!

హీరో ఆర్య నటించిన `అనంతన్ కాడు` చిత్ర బృందం సినిమా ప్రమోషన్లను భారీ ఎత్తున నిర్వహించడంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయింది.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 11:29 PM IST
ఈ వారం రిలీజ్‌ల‌లో బాక్సాఫీస్ బెస్ట్ ఏది?  ఆ నాలుగింటిపైనే అంద‌రి దృష్టి!
X

ఈ వారం సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే శుక్రవారం ఏకంగా అర‌డ‌జ‌ను పైగా మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ ఏడాది ప్రారంభం నుండి కేవలం ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపించగా.. మిగిలిన సమయమంతా మీడియం బడ్జెట్ సినిమాలే ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంల ఒకే వీకెండ్‌లో ఇన్ని చిత్రాలు ఒకేసారి ఒకదానితో ఒకటి తలపడటం సినిమా వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ శుక్రవారం బరిలోకి దిగుతున్న మొత్తం చిత్రాల వివరాలను పరిశీలిస్తే... కోలీవుడ్ (తమిళం) పరిశ్రమ నుండే అత్యధికంగా 5 సినిమాలు వస్తున్నాయి. ఆర్య హీరోగా జియాన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ద్విభాషా చిత్రం `అనంతన్ కాడు`తో పాటు అర్జున్ దాస్ నటించిన `కాన్ సిటీ`, అలాగే `హార్టిన్`, `అంధరన్`, `అంగీకారం` చిత్రాలు తమిళం నుండి రేసులో ఉన్నాయి. వీటితో పాటు కన్నడ పరిశ్రమ నుండి `పంచముఖి`, `గరుడ`, `బలరామన దినగలు` అనే 3 సినిమాలు, మలయాళ పరిశ్రమ నుండి రోషన్ మాథ్యూ కథానాయకుడిగా నటించిన `ఉయిర్` అనే ఒక సినిమా విడుదలవుతున్నాయి.

ఇవ‌న్నీ ఒకేసారి విడుదలవుతున్నా వాటిలో ఆర్య నటిస్తున్న `అనంతన్ కాడు`, అర్జున్ దాస్ `కాన్ సిటీ`, మలయాళ చిత్రం `ఉయిర్`లపైనే ఇండస్ట్రీ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ మూడు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా సర్ప్రైజ్ బ్లాక్‌బస్టర్స్ గా నిలిచే భారీ అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఇండస్ట్రీ ట్రాకర్స్ బలంగా అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాలు ఇప్పటికే సొంతం చేసుకున్న పాజిటివ్ బజ్ కారణంగా ఇవి బాక్సాఫీస్ రేసులో మిగతా చిత్రాల కంటే ముందంజలో ఉండే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

హీరో ఆర్య నటించిన `అనంతన్ కాడు` చిత్ర బృందం సినిమా ప్రమోషన్లను భారీ ఎత్తున నిర్వహించడంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయింది. `సర్పట్ట పరంబరై` విజయంతో నిరూపితమైనట్లు.. ఆర్య ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటనపై పూర్తి అంకితభావంతో ఉంటారనే గట్టి నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందువల్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ ఖాయం. మరోవైపు అర్జున్ దాస్ నటించిన `కాన్ సిటీ` చిత్రం `డార్క్ కామెడీ` జోనర్‌లో వస్తుండటం.. దీని ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సాధారణంగా కామెడీ సినిమాలకు పరిమాణంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి ఇది హిట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ గత కొన్ని ఏళ్లుగా వరుసగా సాలిడ్ మర్డర్ మిస్టరీ కాప్ సినిమాలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. అందువల్ల రోషన్ మాథ్యూ నటిస్తున్న మలయాళ చిత్రం `ఉయిర్` కూడా అదే తరహాలో మరో పవర్‌ఫుల్ కాప్ మిస్టరీగా నిలిచి ప్రేక్షకులను అలరిస్తుందనే గట్టి నమ్మకంతో సినీ ప్రియులు ఉన్నారు. ఈ వారం ఒకేసారి ఇన్ని సినిమాలు థియేటర్లలో పోటీ పడుతున్న నేపథ్యంలో.. ఏయే చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకుని ఈ వీకెండ్ బాక్సాఫీస్ రేసులో అల్టిమేట్ విజేతలుగా నిలుస్తాయో చూడాలి.